Advertisement
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది. తెలంగాణలో కాస్త ఉనికిలో ఉన్నా.. ఆంధ్రాలో మాత్రం జనం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. పైగా అక్కడ ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుండడంతో జాతీయ పార్టీలు ఎదగలేకపోతున్నాయి. ఈ సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏపీ కాంగ్రెస్ నేతల్లో కాస్త ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. అలాగే జనాల్లోనూ కొద్దోగొప్పో నమ్మకాన్ని కలిగించింది.
Advertisement
ఏపీలోకి రాహుల్ గాంధీ ఎంటరైంది మొదలు.. కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా అంశాన్నే లేవనెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ మొదటి సంతకం దానిపైనే చేస్తారని చెప్పారు. దానికి తగ్గట్టే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. అమరావతికి మద్దతు ఇలా పలు అంశాలపై ఆయన స్పందించిన తీరు పార్టీకి జవసత్యాలు తీసుకొచ్చినట్లు అయింది. ఇదే ఊపులో ఆపార్టీ నేతలు కాస్త హడావుడి చేస్తూ ముందుకెళ్తే.. తిరిగి పునర్ వైభవం రావొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Advertisement
ఇక ఏపీలో పాదయాత్రను ముగించిన సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు ప్రేమతో ఓ లేఖ రాశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. జోడో పాదయాత్రకు ప్రజలు చూపిన ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో యాత్ర సందర్భంగా ప్రజలను ప్రభావితం చేస్తున్న పలు సమస్యలు గుర్తించానని.. ప్రత్యేక హోదా సహా అమరావతి రాజధానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వ రంగ హోదా కొనసాగింపును సమర్థిస్తున్నామన్న రాహుల్.. ఏపీలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.
ఏపీలో సవాళ్ల గురించి కాంగ్రెస్ పార్టీకి లోతుగా తెలుసన్న రాహుల్.. గతంలో ఆంధ్రా తమ పార్టీకి కంచుకోటగా ఉండేదని తెలిపారు. ఇక్కడి ప్రజల హృదయాలలో కాంగ్రెస్ తన పూర్వస్థానానికి చేరుకోవడానికి చేయగలిగినదంతా చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు ఈ ప్రయాణంలో భారత్ జోడో యాత్ర మొదటి అడుగుగా నిలుస్తుందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.
రాహుల్ గాంధీ యాత్ర ఈనెల 18న ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో ప్రారంభమైంది. మూడురోజుల పాటు సుమారు 119 కిలో మీటర్లకు పైగా నడిచారు రాహుల్. ఆంధ్రప్రదేశ్ లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర సాగింది.