Advertisement
భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 7తో యాత్ర మహారాష్ట్రలోకి అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. భారీ బహిరంగ సభతో 7న వీడ్కోలు సమావేశం నిర్వహిస్తున్నారు. సభ అనంతరం రాత్రి 9.30కు మహారాష్ట్రలోని దెగ్లూరులో అక్కడి నేతలకు పాదయాత్ర బాధ్యతలను అప్పగిస్తారు.
Advertisement
ఇక శనివారం పాదయాత్ర ఆంధోల్, జోగిపేట, అన్నసాగర్ మీదుగా కొనసాగింది. రాత్రి 7 గంటలకు గడి పెద్దాపూర్ వరకు నడిచారు రాహుల్. మార్గమధ్యంలో వివిధ వర్గాల ప్రజల్ని కలుసుకున్న ఆయన వారి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తూ.. మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. చిన్న, సన్నకారు వ్యవస్థలే చాలా మందికి ఉపాధిని కల్పిస్తాయని.. 2014 తర్వాత కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ వచ్చాక ఉద్యోగాలిచ్చే రంగాలపై దాడి చేశారని ఆరోపించారు.
Advertisement
ధరణి పోర్టల్ ఓపెన్ చేసి ఎవరి భూములు లాక్కోవాలని కేసీఆర్ చూస్తుంటారని ఆరోపించారు రాహుల్. రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలను తెలుసుకోకుండా.. వారి భూములను ప్రభుత్వం లాక్కొంటోందని విమర్శించారు. జోడో యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నానని అన్నారు. అన్ని వర్గాల వారిని తాను కలుస్తున్నానని ఏ ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంతోషంగా లేరని తెలిపారు.
లోక్ సభలో బీజేపీ ఏ చట్టం తీసుకొచ్చినా.. టీఆర్ఎస్ సభ్యులు మద్దతిస్తారని ఆరోపించారు రాహుల్. మోడీ తెచ్చిన వ్యవసాయ చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకించినా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు మద్దతిచ్చారని గుర్తు చేశారు. సమాజంలో ఇబ్బందులు పడుతున్న వర్గాలు గొంతెత్తాలనే లక్ష్యంతో తాము పాదయాత్ర చేస్తున్నామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.