Advertisement
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ లో పూర్తయింది. ఎనిమిదో రోజు బాలానగర్ నుంచి ముత్తంగి వరకు సాగింది. అయితే.. మార్గమధ్యంలో రాహుల్ సరదాగా క్రికెట్ ఆడారు. పటాన్ చెరులో ఇది జరిగింది. ఐదో తరగతి చదివే యశోవర్ధన్ బ్యాట్, బాల్ తో రాహుల్ దగ్గరకు వచ్చాడు. దీంతో కాసేపు అతనికి బౌలింగ్ చేశారు.
Advertisement
రాహుల్ బౌలింగ్ బుడ్డోడు గట్టి షాట్సే కొట్టాడు. అతడి ఆట చూశాక.. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్ ని ఫీల్డింగ్ లో పెట్టారు రాహుల్. కాసేపటి తర్వాత ఆ బుడ్డోడి బ్యాట్ పై ఆటోగ్రాఫ్ చేశారు. వీళ్లు క్రికెట్ ఆడుతున్నంత సేపు ఆ ప్రాంతమంతా కొలాహలంగా కనిపించింది. ఇక ఆ చిన్నారి ప్రైవేట్ విద్యపై రాహుల్ కు వినతిపత్రం అందజేశాడు.
Advertisement
పాదాయాత్ర ముత్తంగికి చేరుకున్నాక ప్రసంగించారు రాహుల్ గాంధీ. సాగు చట్టాల సమయంలో విపక్షాలన్నీ ఒకవైపు ఉంటే.. బీజేపీ-టీఆర్ఎస్ మరోవైపు ఉన్నాయని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలకు పార్లమెంట్ లో టీఆర్ఎస్ మద్దతిచ్చిందని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను మోడీ ప్రభుత్వం కూలదోస్తోందన్న రాహుల్.. వందల కోట్ల ప్రజాధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ, టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ భారత్ జోడో యాత్ర సాగుతుందని తెలిపారు రాహుల్. ఆ రెండు పార్టీలు ఒక్కటై పని చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీ సర్కార్.. వారి మిత్రులకు కారుచౌకగా అన్నీ కట్టబెడుతోందని ఫైరయ్యారు. యువతకు ఉద్యోగాల్లేకుండా చేసిన పాపం మోడీకే తగలుతుందన్నారు రాహుల్ గాంధీ.