Advertisement
తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగిసింది. 8 జిల్లాల్లో 11 రోజుల పాటు మొత్తం 319 కిలోమీటర్లు నడిచారు రాహుల్ గాంధీ. రాహుల్ యాత్ర ముగింపు సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ లో ‘‘భారత్ జోడో గర్జన’’ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలు కురిపించిన ప్రేమను మర్చిపోలేనని అన్నారు. ఈ గడ్డను వదిలి వెళ్తుంటే ఎంతో బాధగా ఉందని భావోద్వేగానికి లోనయ్యారు.
Advertisement
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డ రాహుల్.. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. గిట్టుబాటు ధర ఇస్తామని ప్రకటించారు. యాత్రలో తాను చాలా మందితో మాట్లాడానని, కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారో చూస్తున్నానని తెలిపారు. తెలంగాణలో ఏ ఒక్కరైతు సంతోషంగా లేడన్న ఆయన.. రాష్ట్రంలో విద్య, వైద్యం దయనీయ పరిస్థితిలో ఉన్నాయని ఆరోపించారు. ప్రజల భూములపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెత్తనం చేస్తోందని దుయ్యబట్టారు.
Advertisement
రాష్ట్రంలో కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారన్న రాహుల్.. దెబ్బలు తాకినా, అనారోగ్యానికి గురైన పట్టుదలతో వారు పనిచేయడం చూసి భావోద్వేగానికి గురైనట్లుగా తెలిపారు. దీన్ని మీడియాలో చూపించినా, చూపించకపోయినా తన కళ్లతో చూస్తున్నానని అన్నారు. తెలంగాణలో విద్యావ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మేసిందని ఆరోపించారు. కేసీఆర్, మోడీ కలిసి పనిచేస్తున్నారన్న రాహుల్.. పార్లమెంట్ లో మోడీ తీసుకువచ్చిన ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తారని ఆరోపించారు. వీరిద్దరూ ఒక్కటేనని ఈ విషయాన్ని ప్రజలు ఎప్పుడూ మరిచిపోవద్దన్నారు.
ఇక ఇదే సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. అమరుల త్యాగాలను మరిచిపోవొద్దని.. వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద లేదా అని ప్రశ్నించారు. రైతులు కష్టపడి పండించిన పంటను కొనలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత.. పోతే ఎంత అని రేవంత్ విమర్శించారు. పండించిన పంటను కొనని ప్రభుత్వాలకు రైతులు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.