Advertisement
కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే. కొత్తగా జాతీయ పార్టీగా అవతరించిన ఆప్ గానీ, కొత్తగా జాతీయ పార్టీగా మారాలని చూస్తున్న బీఆర్ఎస్ గానీ.. కాంగ్రెస్ లేకుండా మోడీ సర్కార్ ను కూల్చే పరిస్థితి ఇప్పుడప్పుడే జరిగే పని కాదనేది విశ్లేషకుల వాదన. ఒకవేళ ఈ పార్టీలన్నీ కలిస్తే మాత్రం మెరుగైన ఫలితాలు ఉండొచ్చని వారి అభిప్రాయం. కానీ, ఒకే ఒరలో ఇన్ని కత్తులు ఉండే ఛాన్స్ లేదని అంచనా వేస్తున్నారు. అయితే.. రాహుల్ గాంధీ మాత్రం బీజేపీ సర్కార్ ను కూల్చేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
Advertisement
భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడుస్తున్నారు. ప్రస్తుతం యాత్ర ఢిల్లీ గడ్డపైకి చేరింది. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ గడ్డపై అడుగు పెట్టగానే సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా రాహుల్ తో కలిసి నడిచారు.
Advertisement
ఇక ఎర్రకోట వేదికగా బీజేపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. తన ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేశాయన్నారు. అయితే.. తాను ఒక నెలలోనే సత్యాన్ని యావత్తు దేశానికి రుజువు చేశానని చెప్పారు. తాను 2,800 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశానని.. తనకు ఎక్కడా విద్వేషం కనిపించలేదని చెప్పారు. కానీ, బీజేపీ మాత్రం హిందూ-ముస్లిం విద్వేషాన్ని నిరంతరం వ్యాపింపజేస్తోందని ఆరోపించారు.
ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదని, అంబానీ, అదానీ ప్రభుత్వమని ఆరోపించారు రాహుల్ గాంధీ. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం హిందూ-ముస్లిం వివాదాలను రేపుతున్నారని మండిపడ్డారు. డిగ్రీ చదివిన యువత పకోడీలు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని ఏకం చేయడమే భారత్ జోడో యాత్ర ఉద్దేశమని, ప్రజల్లో నెలకొన్న ద్వేష భావాన్ని తుడిచి వేయాలని భావిస్తున్నానని చెప్పారు రాహుల్ గాంధీ.