Advertisement
ఎట్టకేలకు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. తనపై సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల శిక్ష తీర్పును ఆయన సవాల్ చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సోమవారం పరువునష్టం కేసులో తనను దోషిగా నిర్దారిస్తూ దిగువ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును రాహుల్ సూరత్ కోర్టులో సవాల్ చేస్తారని చెప్పాయి.
Advertisement
మోడీ ఇంటి పేరుపై గతంలో రాహుల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆయన్ను ఇటీవలే సూరత్ కోర్టు దోషిగా ప్రకటించింది. కేసులో ఆయనకు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. వెంటనే బెయిల్ మంజూరు చేసి.. పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి 30 రోజుల పాటు సమయం ఇచ్చింది. అయితే.. ప్రజాప్రాతినిథ్య చట్టం-1951 కింద రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది లోక్ సభ సచివాలయం. ఈ విషయంపై వివాదం కొనసాగుతుండగా.. రాహుల్ గాంధీ తీర్పుపై సవాల్ చేసేందుకు సిద్ధమయ్యారు.
Advertisement
కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం.. రాహుల్ సోమవారం నాడు సూరత్ వెళ్తారు. దిగువ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ వేస్తారు. ఈ నేపథ్యంలోనే సోనియాంగాంధీతో ఆదివారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దేశ రాజధానిలోని ఓ హోటల్ లో సోనియతో సుమారు గంటన్నర సేపు భేటీ అయ్యారు రాహుల్. ఆయన వెంట బావ రాబర్డ్ వాద్రా కూడా ఉన్నారు. ఓవైపు సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తుండడం.. ఇంకోవైపు త్వరలోనే అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తున్న నేపథ్యంలో సోనియాగాంధీని రాహుల్ కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2019 ఎన్నికలకు ముందు ప్రచారంలో దొంగల ఇంటిపేర్లు అన్నీ మోడీ అనే ఉన్నాయి ఎందుకో అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు బాగా హర్టయ్యారు. ముఖ్యంగా మోడీ ఇంటిపేరున్న నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ బీజేపీ నేత పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్ ను దోషిగా తేల్చింది. ఇప్పుడు ఆయన పై కోర్టులో పిటిషన్ వేస్తే.. గత తీర్పుపై స్టే వస్తే.. మళ్లీ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతారు. లేదంటే మాజీగానే ఉండిపోతారు.