Advertisement
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. నిర్లక్ష్యానికి పరాకాష్టగా ఎన్నో ఘటనలు టీవీల్లో చూశాం. ముఖ్యంగా ఎలుకలకు సంబంధించిన వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఐసీయూలో పేషెంట్ ని కొరికేయడం.. పిల్లలను గాయపరచడం.. ఇలాంటి ఘటనలు ఎన్నో. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఆస్పత్రి, ఎలుక రిలేటెడ్ వార్త ఒకటి వైరల్ అవుతోంది.
Advertisement
మధ్యప్రదేశ్ సాగర్ లోని జిల్లా ఆస్పత్రిలో మార్చురీలో ఉంచిన ఓ వ్యక్తి మృతదేహం కన్ను కనిపించకుండా పోయింది. అతని కళ్లను ఎలుకలు కొరికి ఉంటాయని అనుమానిస్తున్నారు. దీనికి కొద్ది రోజుల క్రితం కూడా జిల్లా ఆసుపత్రిలో ఇలాంటి ఉదంతం వెలుగు చూసింది. అప్పుడు కూడా ఒక రోగి కంటిని ఎలుక కొరికింది.
Advertisement
ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మార్చురీలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మృతదేహం కంటిని ఎలుకలు కొరికి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని హాస్పిటల్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అభిషేక్ ఠాకూర్ చెప్పారు. అయితే.. దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని వెల్లడించారు. ఆస్పత్రిలో ఎలుకల బెడద, వైద్యుల నిర్లక్ష్యంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని రోజుల క్రితం, జనవరి 5న కూడా ఇలాంటి కేసు తెరపైకి వచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించగా ఈ విషయం తెలిసింది. అది చూసిన బంధువులు గొడవ ప్రారంభించారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. తాజాగా మరో ఘటన వెలుగుచూడడంతో ఆ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.