Advertisement
భారతేదశంపై ఎప్పుడూ ఏడుస్తుండే దేశాల్లో పాకిస్తాన్ ముందు వరుసలో ఉంటుంది. అక్కడి నుంచి ఎంతో మంది ఉగ్రవాదులు దేశంలోకి పంపడం.. ఇక్కడున్న వారికి అనేక ఆశలు చూపడం చేసి వందల మందిని పొట్టనపెట్టుకున్నారు. ఇంకా దాడులు చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలా.. 2000 సంవత్సరంలో ఎర్రకోటపై దాడికి పాల్పడ్డారు కొందరు ముష్కరులు. దీనికి సంబంధించిన కేసులో అసలు సూత్రధారికి మరణశిక్షే కరెక్ట్ అని తాజాగా తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు.
Advertisement
పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఢిల్లీలోని ఎర్రకోటపై 2000 సంవత్సరం డిసెంబర్ 22న ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఈ దాడికి సూత్రధారిగా తేలిన ఆరిఫ్ కు 2005లో ఢిల్లీ ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే.. 2007లో అతడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. మరణశిక్షను రద్దు చేయాలని వేడుకున్నాడు. కానీ, కోర్టు అందుకు అంగీకరించలేదు. ఉరిశిక్షను అమలు చేయాలని ఆదేశించింది.
Advertisement
ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. 2011లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఆరిఫ్. కింది కోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. అతని రివ్యూ, క్యూరేటివ్ పిటిషన్లు కూడా కొట్టివేసింది. కానీ, 2014 సెప్టెంబర్ లో రాజ్యాంగ బెంచ్ ఇచ్చిన ఓ తీర్పు నేపథ్యంలో ఆరిఫ్ కు మరణ శిక్షపై పోరాడేందుకు మరో అవకాశం దక్కింది. న్యాయమూర్తుల ఛాంబర్లలో కాకుండా ఓపెన్ కోర్టులో రివ్యూ పిటిషన్ పై విచారణ జరపాలని ఆ తీర్పు చెప్పింది.
లష్కరే తోయిబాకు చెందిన ఈ టెర్రరిస్టుకు మరణశిక్షే సరైందని చీఫ్ జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన బెంచ్ తాజాగా అభిప్రాయపడింది. కింది కోర్టులు ఇచ్చిన తీర్పుల్లో తాము జోక్యం చేసుకోవలసిన పని లేదని పేర్కొంది. ఈ కేసులో గతంలో ఆరిఫ్ భార్య రెహమానా యూసుఫ్ ఫరూకీకి, మరికొందరికి జైలు శిక్షలు పడ్డాయి.