Advertisement
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం మునుగోడులో అన్ని పార్టీలు తిష్ట వేశాయి. ఇంకేముంది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక రంజుగా మారింది. పార్టీల మధ్య ఉపఎన్నిక పోరు కాక పుట్టిస్తోంది. ప్రచారంలో నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు, దాడులు హీట్ పుట్టిస్తున్నాయి. ప్రచారానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో పార్టీలన్నీ మరింత జోరు పెంచాయి. గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నాయి.
Advertisement
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మూడు రంగుల జెండాను భుజాన మోస్తూ సూర్యోదయానికంటే ముందే వేలాదిగా తరలివచ్చి, రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రకు అద్భుతమైన ఆహ్వానం పలికిన తెలంగాణ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ శ్రేణులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.”నికార్సైన కాంగ్రెసోడా మునుగోడుకు కదలిరా, మునుగోడును కేవలం ఒక్క ఉప ఎన్నిక గానే చూడలేం. కాంగ్రెస్ ను అంతం చేయాలని బిజెపి, టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి. దుష్టశక్తులన్నీ ఏకమై మనల్ని ఒంటరి చేయాలనుకుంటున్నాయి. కాంగ్రెస్ భిక్షతో ఎదిగి వాళ్లే వెన్నుపోటు పొడిచారు. సిఆర్పిఎఫ్, ఎలక్షన్ కమిషన్లను బిజెపి దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్ర పోలీసులు, స్థానిక అధికార గణాన్ని టిఆర్ఎస్ విచ్చలవిడిగా ఉపయోగిస్తోంది. అడుగున ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.
Advertisement
పవిత్రమైన యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవస్థానాన్ని రాజకీయ లబ్ధికి వేదికగా మార్చడం దీనికి పరాకాష్ట. ఆడబిడ్డ అని చూడకుండా పాల్వాయి స్రవంతి పై రాళ్ల దాడులకు తెగబడ్డారు. మన కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే నిశ్శేష్ఠులుగా ఉందామా!? తెలంగాణ ఆస్తిత్వానికి ప్రాణం పోసిన తల్లి సోనీయమ్మకే ద్రోహం చేస్తుంటే ఊరుకుందామా? కాంగ్రెస్ ఏం పాపం చేసిందని ఈ కుట్రలు!? 60 ఏళ్ల ఆకాంక్షను నిజం చేయడమే కాంగ్రెస్ చేసిన నేరమా!? పోరాటాల చరిత్రకు వారసులమైన మనం బాంచన్ దొర అని బానిసలవుదామా, నిప్పుకనికలై నిటారుగా నిలబడి కోట్లాడుదామా తేల్చుకోవాల్సిన సమయం ఇది. తెలంగాణ నలుమూలలా నుండి కాంగ్రెస్ శ్రేణులు ఉన్నపలంగా కదలిరండి. మునుగోడులో కలసి కదం తొక్కుదాం. ప్రాణమో, ప్రజాస్వామ్యమో తాడోపేడో తేల్చుకుందాం. మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం. ఈ క్షణమే కదలండి, మీకోసం మునుగోడులో ఎదురు చూస్తుంటా. కులాలు, మతాలకు అతీతంగా తెలంగాణ నలుమూలల నుంచి మునుగోడుకు తరలిరండి” అని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.
READ ALSO : పాక్ పరువు గంగలో కలిపిన Google సీఈవో సుందర్ పిచాయ్…!