Advertisement
తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడూ ఏదో ఒక లొల్లి జరుగుతూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ పదవి చేపట్టాక ఇది మరింత ఎక్కువైంది. టీడీపీలో ఎదిగి కాంగ్రెస్ పార్టీని నానా తిట్లు తిట్టి.. ఇప్పుడు అదే పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగడమే కొందరు నేతలకు నచ్చడం లేదు. ముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్లను కాదని రేవంత్ కు పదవి కట్టబెట్టడంపై బహిరంగంగానే కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్టానం ఎప్పటికప్పుడు వారిని బుజ్జగిస్తూ వస్తోంది. ఈక్రమంలోనే కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు. పోతూపోతూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీలో ప్రక్షాళనకు పూనుకుంది ఏఐసీసీ.
Advertisement
పార్టీలో కీలక మార్పుల దిశగా అడుగులు వేసిన అధిష్టానం.. కొత్త కమిటీలను ప్రకటించింది. కానీ, అదే పెద్ద రచ్చకు దారి తీసింది. ఈ కమిటీల్లో కొందరు సీనియర్లకు ప్రాధాన్యం దక్కకపోవడం, జూనియర్లను అందలం ఎక్కించడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదట దీనిపై కొండా సురేఖ స్పందించారు. తన పదవికి రాజీనామా చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే.. బెల్లయ్య నాయక్ కూడా అదే బాటలో నడిచారు. తనకు పదవులు కాదు ప్రజలే ముఖ్యమని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కొందరు నేతలైతే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి అధిష్టానంతో చర్చలకు వెళ్లారు.
Advertisement
మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసంతృప్తి నేతలతో భేటీ కావడం అనేక అనుమానాలకు తావిచ్చింది. మొదట్నుంచి రేవంత్ అంటే పడని వారిలో భట్టి కూడా ఒకరు. పైకి నవ్వుతూ పలకరించినా ఆయనంటే పడదనే అభిప్రాయం పార్టీలో ఎప్పుడూ వినిపిస్తుంటుంది. తాజాగా ప్రకటించిన కమిటీల్లో రేవంత్ కు సంబంధించిన వారే అధికంగా ఉండడంతో అసంతృప్త నేతలను భట్టీనే ఉసిగొల్పుతున్నారనే చర్చ మొదలైంది. కొందరు నాయకులతో ఆయన సమావేశం కావడమే దీనికి ఆజ్యం పోసింది.
కోమటిరెడ్డి సైలెంట్ అయిపోయాక.. రేవంత్ కు ప్రతీ దాంట్లో భట్టి అడ్డు తగులుతున్నారనే చర్చ ఉంది. ఆయన పాదయాత్ర చేస్తానంటే.. తాను కూడా చేస్తానని చెప్పడం, నాయకులతో సమావేశాలు జరపడంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈక్రమంలోనే పదవులు రాని నేతలను భట్టి ఉసిగొల్పుతున్నారనే ప్రచారం జోరందుకుంది.