Advertisement
ఎన్నికలు దగ్గర పడేకొద్దీ తెలంగాణలో నేతలు హాట్ హాట్ కామెంట్స్ తో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఎదుటి పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సవాళ్లు విసురుతున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య అగ్గి రాజుకుంది. ముందుగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తు అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. కాంగ్రెస్ మీద కేసీఆర్ ఈగ కూడా వాలనివ్వడం లేదని, ఒకవేళ రేపు కాంగ్రెస్ గెలిచినా ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ నే అని తెలిపారు.
Advertisement
మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నుంచి రూ.25 కోట్లు ముట్టాయని ఆరోపణలు చేశారు. తాను చెప్పింది అబద్ధమని గుండెలపై చేయి వేసుకుని చెప్పమనండని వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ డబ్బులు పంపించిందనేది వందకు వంద శాతం సత్యమని పేర్కొన్నారు. దానికి లెక్కా పత్రాలుంటాయా? అని ఎవిడెన్స్ చూపించగలమా అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చిన్న ఇబ్బంది కలిగినా మొదటగా స్పందించేది కేసీఆర్, కేటీఆరేనని ఈటల చురకలంటించారు.
Advertisement
ఎన్నికల ముందో, తర్వాతో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు ఈటల. అయితే.. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈటల వ్యాఖ్యలను ఖండించారు. అసలు, మునుగోడు ఉప ఎన్నిక కోసమే కాదు.. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా కేసీఆర్ నుండి అణా పైసా ముట్టలేదని స్పష్టం చేశారు. రూ.25 కోట్ల మేర కేసీఆర్ నుండి కాంగ్రెస్ కు ముట్టిందని ఈటల చెబుతున్నారని, అలాంటిది ఏమీ లేదని తాను శనివారం భాగ్యలక్ష్మి ఆలయానికి తడిబట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధమని చెప్పారు.
ఒకవేళ ఈటల మరో గుడికి రమ్మన్నా తాను వెళ్లి, ప్రమాణం చేయడానికి సిద్ధమని చెప్పారు రేవంత్. తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని దేవుడి పైన ఒట్టేసి చెబుతున్నా అని తెలిపారు. మునుగోడులో ప్రతి పైసా కాంగ్రెస్ పార్టీదని.. కార్యకర్తల కష్టార్జితమని తెలిపారు. ఈటల తన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలను అవమానిస్తున్నారని.. 24 గంటల్లో ఈ ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే.. శనివారం సాయంత్రం ఆరు గంటలకు భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణానికి సిద్ధమన్నారు. ఈటల కూడా వచ్చి ప్రమాణం చేయాలన్నారు. రాజకీయాల కోసం ఈటల ఇలా దిగజారి మాట్లాడటం సరికాదని హితవు పలికారు రేవంత్ రెడ్డి.