Advertisement
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల క్రాస్ ఓటింగ్.. నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. క్రాస్ ఓటింగ్ కి పాల్పడింది వీరే అంటూ ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. ఆనం, కోటంరెడ్డి ఓట్లను అందరూ ముందే ఊహించారు. అయితే.. మేకపాటి, ఉండవల్లి పేర్లు ప్రకటించడం అందర్నీ షాక్ కి గురి చేసింది. ఇప్పుడీ నలుగురు టీడీపీ గూటికి చేరతారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు టీడీపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అదేరీతిలో కౌంటర్ ఎటాక్ కొనసాగిస్తున్నారు.
Advertisement
క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలకు దమ్ముంటే.. రాజీనామా చేయాలని మంత్రి రోజా సవాల్ విసిరారు. ఒక్క ఎమ్మెల్సీ స్థానం గెలిచి.. ఏదో సాధించామని టీడీపీ సంబరపడిపోతోందని సెటైర్లు వేశారు. రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. చంద్రబాబు నీచ రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు రోజా. ఇక ఉండవల్లి శ్రీదేవి కామెంట్స్ పై ఆమె ఫైరయ్యారు. హైదరాబాద్ లో ఉండే డాక్టర్ ను తీసుకొచ్చి అమరావతిలో గెలిపిస్తే.. పార్టీకి ద్రోహం చేస్తారా? అంటూ ఫైరయ్యారు. ఎంత పెద్ద డాక్టర్ అయినా.. ఎంత సీనియర్ లీడర్ అయినా సరే.. ఎన్నికల్లో జగన్ వల్లే గెలుపొందారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు రోజా.
Advertisement
రోజా వ్యాఖ్యలకు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ లాక్కుందని.. ఇప్పుడు అదే పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ అభ్యర్థికి ఓటు వేయడంతో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచామని అన్నారు. ఇది దేవుని స్క్రిప్ట్ అని ఎద్దేవ చేశారు. జబర్దస్త్ మేడం.. పట్టభద్రుల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీకి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో చూస్కో అని రోజాకు చురకలంటించారు. అయినా, నలుగురు ఎమ్మెల్యేలను అప్పటికప్పుడు సస్పెండ్ చేసిన వైసీపీ.. ఎంపీ రఘురామ కృష్ణరాజును ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు.
ఇక సీఎం జగన్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు అనిత. ఒకప్పుడు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ను ఇప్పుడు గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చారని ఆరోపించారు. జగన్ అసమర్థ ముఖ్యమంత్రి అని విమర్శించారు. సైకో జగన్ సీఎం సీట్లో కూర్చున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ గంజాయి, హత్య, అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందని అందరూ చెప్పుకుంటున్నారన్నారు. ఒక్క సంవత్సరంలో 2.6 లక్షల కిలోల గంజాయి పట్టుబడిందంటే ఎంత విచ్చలవిడిగా రవాణా జరుగుతుందో అర్థమవుతోందని మండిపడ్డారు. చివరికి పవిత్రమైన తిరుమలలో కూడా గంజాయి దొరుకుతున్న దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారని ఫైరయ్యారు అనిత.