Advertisement
వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం.. అవినాష్ ను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరగడం.. వెంటనే ఆయన ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే.. సీబీఐ దర్యాప్తుపై వైసీపీ ఎటాక్ కొనసాగిస్తోంది. తాజాగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అంతా చంద్రబాబు కుట్రగా మాట్లాడారు.
Advertisement
వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ హడావిడి చేస్తోందన్నారు సజ్జల. కేసు ముగింపునకు వచ్చినట్లు చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని.. సీబీఐ వాడుతున్న పదాలు, వాడుతున్న మాటలు చూస్తే టీడీపీ రాజకీయ అజెండా అర్ధం అవుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే అంశాన్ని, కల్పిత కథను నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తారని చంద్రబాబుపై మండిపడ్డారు.
Advertisement
హత్యలో నేరుగా పాల్గొన్న దస్తగిరితో రాజకీయ స్టేట్ మెంట్లు ఇప్పిస్తున్నారని పేర్కొన్నారు సజ్జల. ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే దర్యాప్తును భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని ఇరికించేలా సీబీఐ చేస్తోందన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక జగన్ ప్రతిష్టను దిగజార్చేలా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్ రంగన్న వుండగా, అప్రూవర్ మాటల్ని ఎందుకు సీబీఐ పట్టించుకుంటోందని ప్రశ్నించారు. ఈ కేసులో సీబీఐ పేర్లను చేర్చుకుంటూ పోతుంటే టీడీపీ ప్రింట్లు వేస్తోందని మండిపడ్డారు.
ఇటు సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ ఫైరవుతోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గజదొంగే.. దొంగా, దొంగా అని అరుస్తున్నట్టు ఉందని ఎద్దేవ చేశారు. వివేకా హత్యలో నిందితులు ఎవరో తెలిసాక కూడా సజ్జల మీడియాపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్యను మొదట చంద్రబాబుకు, ఆపై సునీతారెడ్డికి అంటగట్టి ఇప్పుడేమో ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథలు అల్లుతున్నారని మండిపడ్డారు. జగనాసుర రక్త చరిత్ర క్లైమాక్స్ వచ్చేసరికి సీబీఐ దర్యాప్తును తప్పుబడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. సీబీఐ ఎలా దర్యాప్తు చేయాలో సజ్జల చెబుతారా? అని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా వివేకా హత్య కేసు నిందితులు తప్పించుకోలేరన్నారు అచ్చెన్నాయుడు.