Advertisement
బీజేపీ అగ్ర నేతలు తెలంగాణకు వస్తున్నారంటే చాలు.. రకరకాల ఫ్లెక్సీలు దర్శనమిస్తాయి. ఇచ్చిన హామీలు, నిధులపై నిలదీస్తూ ఊరు, పేరు లేకుండా ఇవి ఏర్పాటవుతూ ఉంటాయి. అయితే.. ఇదంతా టీఆర్ఎస్ ప్లాన్ అనేది బీజేపీ వాదన. కేంద్రం నిధులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నా.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఫ్లెక్సీల రాజకీయాన్ని తప్పుబడుతూ కేసీఆర్ పై ఫైర్ అవుతూ ఉంటారు కమలనాథులు. అయితే.. ఈసారి కేటీఆర్ వంతు వచ్చింది.
Advertisement
మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. కూకట్ పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లగా.. సాలు దొర-సెలవు దొర ఫ్లెక్సీలు కనిపించాయి. అయితే.. దీనిపై పేరుతో సహా ప్రచురణ చేశారు. మేడ్చల్ అర్బన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీలని ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలుచోట్ల ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రతీసారి బీజేపీ నేతలు ఎవరు వచ్చినా టీఆర్ఎస్ శ్రేణులు కావాలని రెచ్చగొడుతూ ఫ్లెక్సీలు పెడుతున్నారని అంటున్నాయి బీజేపీ వర్గాలు.
Advertisement
కేసీఆర్ సర్కార్ ను గద్దె దించుతామని పార్టీ ఆఫీస్ లో సాలు దొర సెలవు దొర పేరుతో డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ బోర్డుకు కల్వకుంట్ల కౌంట్ డౌన్ అని నామకరణం చేయగా.. కేసీఆర్ ను అధికారంలో నుంచి దించడానికి ఎన్ని రోజుల సమయం ఉందనే విషయాన్ని గంటలు, నిమిషాలు, సెకన్లతో సహా డిజిటల్ బోర్డులో పొందుపర్చారు. ఐదు నెలల క్రితమే ఈ డిజిటల్ బోర్డు ఏర్పాటు చేయగా.. అనుమతి లేకుండా బోర్డు ఏర్పాటు చేశారనే కారణంతో తొలగించాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. తర్వాత పర్మిషన్ తీసుకున్నారు. సోషల్ మీడియాలో సాలు దొర సెలవు దొర పేరుతో ప్రమోషన్ కూడా బాగా చేస్తున్నారు. ఈక్రమంలోనే కేటీఆర్ టూర్ లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు లోకల్ బీజేపీ లీడర్లు.
మరోవైపు కూకట్‌పల్లి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో రూ.28.51 కోట్ల వ్యయంతో నూతనంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, టీఆర్ఎస్ నేతలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కేటీఆర్ అన్నారు.