Advertisement
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఒక్కో జిల్లాను కవర్ చేస్తూ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. అక్కడ రోడ్డుపైనే బహిరంగ సభ ఏర్పాటు చేయగా.. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా ఎటుచూసినా జనమే కనిపించారు.
Advertisement
జనం భారీగా తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. సభా ప్రాంగణానికి దగ్గరలో మురికి కాలువ ఉంది. తోపులాట జరిగి అందులో కొందరు పడిపోయారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. అలాగే తోపులాటలో పలువురు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
మృతులు ఆత్మకూరు చెందిన దేవినేని రవీంద్రబాబు, కొండమూడుసుపాలెంకు చెందిన కలవకూరి యానాది, ఉలవపాడుకు చెందిన యాటగిరి విజయ, కందుకూరుకు చెందిన కాకుమాని రాజా, గుళ్లపాలెంకు చెందిన మరలపాటి చినకొండయ్య, కందుకూరుకు చెందిన పురుషోత్తంగా గుర్తించారు.
ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి పార్టీ అన్నీతానై చూసుకుంటుందని స్పష్టం చేశారు. తీవ్ర ఆవేదనతో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అప్పటికప్పుడు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే.. మృతుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు విద్యాసంస్థల్లో చదివిస్తామని హామీ ఇచ్చారు.