Advertisement
సూపర్ స్టార్ కృష్ణ.. 1942 మే 31న గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆయన స్వస్థలం తెనాలి పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్రిపాలెం గ్రామం. ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు పెద్దకొడుకుగా జన్మించారు కృష్ణ. అప్పుడు ఆయనది ఓ సాధారణ రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా.. సినీ రంగ ప్రవేశం తర్వాత ఆదుర్తి సుబ్బారావు ఆయన పేరుని కృష్ణగా కుదించారు. మొదట పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించిన కృష్ణ.. 1965 లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తేనె మనసులు చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు.
Advertisement
Read also: యాంకర్ సుమ ఇంటిని ఏయే సినిమాల షూటింగ్‌లకు ఉపయోగించారో తెలుసా..?
Advertisement
ఈ చిత్రం ప్రారంభమయ్యే నాటికే 1961లో ఇందిరా దేవిని వివాహమాడారు సూపర్ స్టార్ కృష్ణ. ఇక 1965 అక్టోబర్ 13 నాటికి పెద్దకొడుకు రమేష్ బాబు జన్మించారు. కృష్ణ – ఇందిర దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. వీరిలో రమేష్ బాబు, మహేష్ బాబు కుమారులు కాగా.. ప్రియదర్శిని, మంజుల, పద్మావతి కుమార్తెలు. ఇక 1969లో కృష్ణ తన సహచర నటి విజయనిర్మలను తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే వివాహితులైన కృష్ణకు, విజయనిర్మలకు ఇది రెండవ పెళ్లి. విజయనిర్మలకు అప్పటికే కొడుకు నరేష్ ఉన్నాడు. 2019లో విజయనిర్మల అనారోగ్యంతో కన్నుమూయడంతో కృష్ణ మానసికంగా కృంగిపోయారు.
ఇక ఈ ఏడాది కృష్ణ జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఏడాది జనవరి 8న కృష్ణ కుమారుడు రమేష్ బాబు కాలేయ సంబంధ వ్యాధితో కన్నుమూశారు. ఆయన ఈ బాధ నుంచి కోలుకోక ముందే ఇందిరా దేవి సెప్టెంబర్ 28న అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఇలా కృష్ణ జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురు కావడంతో ఆయన మానసికంగా కృంగిపోయారు. ఆదివారం గుండె పోటు రావడంతో కృష్ణను కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. కాగా మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.