Advertisement
మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి దారులన్నీ మూసుకుపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అనేక రకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. తండ్రి భాస్కర్ రెడ్డి మాదిరిగానే అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది.
Advertisement
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంలో వివేకా కుమార్తె పిటిషన్ వేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అవినాష్ రెడ్డిని సీబీఐ అడిగే ప్రశ్నలను ప్రింటెడ్ ఇవ్వాలని, ఆయన్ని విచారణను వీడియో రికార్డు చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం తప్పుబట్టింది. అసలు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎలాంటివని ధర్మాసనం ప్రశ్నించింది.
ఇవి చాలా దారుణమైన ఆదేశాలని.. ఏమాత్రం ఆమోదయోగ్యం కావని పేర్కొంది సుప్రీం. ఈ విషయంలో అవినాష్ రెడ్డికి ధర్మాసనం నోటీసులు పంపింది. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. దీంతో అవినాష్ రెడ్డికి భారీ షాక్ తగిలినట్టైంది. అవినాష్ తరఫున సీనియర్ అడ్వకేట్ రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు.
Advertisement
ఏప్రిల్ 30 లోగా కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఆదేశాలు జారీ చేసిందని ధర్మాసనం దృష్టికి సునీత తరఫు న్యాయవాది గుర్తు చేశారు. సీబీఐ విచారణకు ఎంపీ ఎప్పుడూ సహకరించలేదని, అందువల్ల ఆయనకు రక్షణ కల్పించకూడదని కోరారు. అంతకుముందు సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బెయిల్ దరఖాస్తుదారు తనకు గుండెపోటు వచ్చిందని, విచారణ నుంచి తప్పించుకునేందుకు కొందరు అధికారులపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.
ఇప్పటికే అవినాష్ తండ్రి ఊచలు లెక్కబెడుతున్నారు. ఇప్పుడు ఆయనకు కూడా ఇది తప్పేలా లేదనే ప్రచారం సాగుతోంది. మరోవైపు వరుసగా మూడోరోజు సీబీఐ అధికారులు అవినాష్ ను విచారించారు. ఈసారి 6 గంటలపాటు విచారణ కొనసాగింది. మూడు రోజులుగా వివేకా హత్యకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది సీబీఐ. నెక్స్ట్ విచారణపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు అధికారులు. దీంతో ఏం జరుగనుందనే టెన్షన్ నెలకొంది.