Advertisement
ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి కేసీఆర్ సర్కార్ దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే కేసును సీబీఐకి అప్పగిస్తూ పెద్ద షాకిచ్చింది హైకోర్టు. దాన్ని సవాల్ చేస్తూ అత్యవసర విచారణ కోరితే సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో మరోసారి ఈ కేసు చర్చనీయాంశంగా మారింది.
Advertisement
బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు నిందితులు రాయబారాలు నడిపారు. వీళ్ల వెనుక బీజేపీ ఉందని బీఆర్ఎస్ గట్టిగా వాదించినా.. దానికి సంబంధించి సరైన ఆధారాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. నిజానిజాలు తేల్చేందుకు ప్రభుత్వం సిట్ ను వేసింది. బీజేపీ బడా లీడర్ కు నోటీసులు పంపినా ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కొందర్ని విచారించినా.. సిట్ పై నమ్మకం లేదని కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మొదట సింగిల్ బెంచ్ విచారణ జరపగా.. సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది.
Advertisement
ఈ తీర్పును మరో బెంచ్ దగ్గర సవాల్ చేసింది ప్రభుత్వం. అక్కడ కూడా ఎదురుదెబ్బ తప్పలేదు. దీంతో చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీజేఐ ధర్మాసనం ముందు ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లుత్రా దీన్ని మెన్షన్ చేశారు. అయితే.. స్టేటస్ కో ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. కేసులో మెరిట్స్ ఉంటే హైకోర్టు తీర్పును రివర్స్ చేస్తామని కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఈనెల 17న విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై త్వరితగతిన విచారణకు నిరాకరించింది. న్యాయవాది పదే పదే విజ్ఞప్తి చేసినా ఒప్పుకోలేదు.
సీబీఐ చేతికి సాక్షులు వెళ్తే చేసేది ఏమీ లేదని సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. మెరిట్స్ ఉంటే హైకోర్టు తీర్పును రివర్స్ చేస్తామని పేర్కొంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి తెలంగాణ సీఎస్ కు సీబీఐ మరోసారి లేఖ రాసింది. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ వివరాలను ఇవ్వాలని కోరింది. ఇదివరకు సీఎస్ కు సీబీఐ ఐదుసార్లు లేఖ రాసింది.