Advertisement
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. 16వ రోజు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పర్యటించారు. అయితే.. పోలీసుల ఆంక్షలతోనే యాత్ర కొనసాగింది. ఉదయం ఎస్ఆర్ పురం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు లోకేష్. అక్కడ పాదయాత్రకు పోలీసులు అడ్డుపడ్డారు. లోకేష్ ను మాట్లాడనివ్వకుండా మైక్ లాక్కున్నారు. శుక్రవారం కూడా ఇదే సీన్ రిపీట్ అయింది.
Advertisement
పుల్లూరు క్రాస్ రోడ్డులో పోలీసులు మైక్ లాక్కోవడంతో అక్కడికి వచ్చిన జనాలను సైలెంట్ గా ఉండమని చెప్పి అలాగే మాట్లాడారు లోకేష్. పోలీసుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన మైకు లాక్కోవడంపై పెట్టిన శ్రద్ధ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవడంపై పెట్టాలన్నారు. తన పాదయాత్రను అడ్డుకోవడానికి వెయ్యి మంది పోలీసులు, ఆరుగురు డిఎస్పీలు వచ్చారని, చివరకు మహిళలకు రక్షణ కల్పించాల్సిన దిశ డీఎస్పీ కూడా తన వెంటే తిరుగుతున్నారని మండిపడ్డారు.
Advertisement
రాష్ట్రంలో ఎవరిని కదిలించినా జగన్ ప్రభుత్వ బాధితులే ఉన్నారని అన్నారు లోకేష్. ఆయా వర్గాల ప్రజలు తనను కలిసి బాధలు చెప్పుకుంటున్నారని చెప్పారు. జగన్ పిల్లిలా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారని… దమ్ముంటే పులిలా తనకు మైకు ఇప్పించి మాట్లాడించాలన్నారు. రెండున్నరేళ్లుగా మంత్రిగా ఉండి తాను ఏ తప్పు చేయలేదని.. అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వస్తున్నానని చెప్పారు. జగన్ భయపడి పరదాలు కట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయింది టీడీపీ కాదు, రాష్ట్ర ప్రజలు అని వ్యాఖ్యానించారు లోకేష్.
ఇక యువగళం పాదయాత్ర శనివారం సాయంత్రం నాటికి 200 కిలోమీటర్లు పూర్తి చేసింది.వ ఈ సందర్భంగా కార్వేటినగరం మండలం కత్తెరపల్లి జంక్షన్ లో లోకేష్ పై పార్టీ నేతలు, కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. పెద్దఎత్తున బాణాసంచా కాలుస్తూ జయజయధ్వానాలు పలికారు. జయహో లోకేష్.. జయహో టీడీపీ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. 200 కిలోమీటర్ల యాత్ర చేరుకున్నందుకు గుర్తుగా టీడీపీ శ్రేణులు ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు.