Advertisement
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో కొనసాగుతోంది. 67వ రోజు ముందుగా మహనీయుడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అట్టడుగువర్గాలు, మహిళల ఆత్మగౌరవ పోరాటానికి విద్యనే ఆయుధంగా అందించిన పూలే మహాశయుని ఆశయసాధనకి కృషి చేయడం అందరి బాధ్యత అని చెప్పారు.
Advertisement
తాడిపత్రిలోకి ఎంటర్ అవ్వగానే స్థానిక టీడీపీ నేతలు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ నేతలు, కార్యకర్తలు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు లోకేష్ తో ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ శ్రేణుల్లో మరింత జోష్ పెంచారు. డప్పు చప్పుళ్లకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. తనతో పాటు ఇతరులతో కూడా స్టెప్పులు వేయిస్తూ హుషారును పెంచారు.
Advertisement
పాదయాత్ర ప్రారంభం కాగానే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య లోకేష్ కు నోటీసులు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కల్పించొద్దని హితవు పలికారు. లోకేష్ కు నోటీసులు అందజేసేందుకు డీఎస్పీ చైతన్య వెళ్లగా.. తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. దీంతో చేసేదేం లేక టీడీపీ మండల కన్వీనర్ రుద్రమనాయుడుకు నోటీసులు అందజేశారు పోలీసులు.
అయితే.. పోలీసుల నోటీసులపై తనదైన రీతిలో లోకేష్ రియాక్ట్ అయ్యారు. 67 రోజులుగా తాను పాదయాత్ర చేస్తున్నానని.. ఎక్కడా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని వివరించారు. కాకపోతే, ప్రభుత్వ అవినీతిని.. ఎమ్మెల్యేల అవినీతిని కచ్చితంగా తాను ఎండగడతానని స్పష్టం చేశారు.
తాడిపత్రి నియోజకవర్గంలో మూడు రోజుల పాటు యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. ముందస్తు జాగ్రత్తగా పోలీసుల్ని భారీగా మోహరించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే పాదయాత్ర వద్దకు వచ్చి లోకేష్ ను నిలదీస్తానని అన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలతో తాడిపత్రి నియోజకవర్గంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు చూసినట్టు తెలుస్తోంది.