Advertisement
తెలంగాణ పేపర్ లీకేజ్ ఇష్యూ చుట్టూ రాజకీయం నడుస్తుండగా.. ఏపీలో సైలెంట్ గా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి. టీడీపీ, వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఏడు స్థానాల్లో ఆరింటిని వైసీపీ కైవసం చేసుకోగా.. టీడీపీ ఒక స్థానంలో గెలిచింది. అయితే.. తక్కువమంది సభ్యులున్న టీడీపీ ఆ ఒక్క స్థానంలో ఎలా గెలిచిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ నిలబడ్డారు. ఆమెకు మొత్తం 23 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీలో టీడీపీకి ఉన్న బలం 19 మాత్రమే. అయినా ఆమెకు 23 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. క్రాస్ ఓటింగ్ పై సీఎం జగన్ ఎన్ని చర్యలు చేపట్టినా టీడీపీ అభ్యర్థికి 23 ఓట్లు పడటం చర్చనీయాంశంగా మారింది.
Advertisement
గత ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాల్లో గెలిచింది. నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి జై కొట్టడంతో ప్రస్తుతం 19 మందే ఉన్నారు. అయితే.. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఈమధ్య తమ స్వరం మార్చారు. సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. దీంతో టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేల ఓట్లే పడతాయని అంతా ఊహించారు. గెలవాలంటే 22 ఓట్లు కావాలి.. అనూహ్యంగా క్రాస్ ఓటింగ్ పుణ్యమా అని టీడీపీ అభ్యర్థి అనురాధ గెలుపొందారు. ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో గందరగోళానికి దారితీసింది.
మరోవైపు టీడీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. ‘‘దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడు. 23 ఓట్లతో గెలిచాం. ఇవాళ 23వ తేదీ 2023. ఓటు ఎలా వేయాలి అనే దానిపై తాను సరైన శిక్షణ తీసుకోకుండా సీఎం జగనే స్వయంగా మాకు ఓటేశారేమో అన్న అనుమానం కూడా ఉంది. ఓటింగ్ లో పాల్గొనకుండా మా ఎమ్మెల్యే భవానీ కుటుంబాన్ని వేధిస్తారా? ఇక వార్ వన్ సైడే’’ అంటూ ట్వీట్ చేశారు.