Advertisement
ఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక భవనాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు సీఎం కేసీఆర్. పార్టీ నేతలు, పలువురు జాతీయస్థాయి నాయకులు, రైతుల సమక్షంలో జెండా ఎగురవేశారు. ఇటు రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ భారీ ఎత్తున ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు దశకు చేరింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు.
Advertisement
నడ్డా టూర్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. గురువారం మధ్యాహ్నం 2.10 నిమిషాలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. 2.50కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 3.30కి కరీంనగర్ చేరుకుంటారు. 3.40కు పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకుని.. 4.30 వరకు అక్కడే ఉంటారు. 4.45 నిమిషాలకు కరీంనగర్ నుంచి బయలుదేరి 5.25 కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 5.35కు బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. నడ్డా టూర్ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.
Advertisement
ఇక ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర ముగింపు దశకు చేరుకోవడంతో బీఆర్ఎస్ పై మాటల దాడి పెంచారు బండి సంజయ్. బీఆర్ఎస్ వైరస్ అని.. బీజేపీ వ్యాక్సిన్ అని.. ప్రజలు ఏది కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందన్న ఆయన.. బీజేపీ తాకిడిని తట్టుకోలేకే కేసీఆర్ ఢిల్లీ పారిపోయారని విమర్శించారు. కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని, వాల్లే ప్రజాప్రతినిధులని అన్నారు.
మాదకద్రవ్యాల కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాత్రపై విచారణ చేయాలని తాము కోరనున్నట్లు స్పష్టం చేశారు బండి. తమ లీగల్ టీమ్ బెంగళూరు వెళ్లిన విషయాన్ని అక్కడి అధికారులు.. హైదరాబాద్ అధికారులకు చేరవేశారని దీంతో కేసీఆర్ హడావుడిగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి స్టేట్ మెంట్ ను రికార్డు చేయించారని ఆరోపించారు. లీగల్ టీమ్ విచారణ చేస్తున్న విషయం రోహిత్ రెడ్డికి తెలిస్తే.. వాస్తవాలు బయటపెడతారని కేసీఆర్ భయపడ్డారన్నారు. మత్తు కేసులో కర్ణాటక ప్రభుత్వం నుంచి రోహిత్ రెడ్డికి గతంలో నోటీసు వచ్చిందని గుర్తు చేశారు బండి సంజయ్.