Advertisement
జీవో 317 మరోసారి చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తల బదిలీలపై ఉపాధ్యాయులు మరోమారు రోడ్డెక్కడమే అందుకు కారణం. జీవో 317ను సవరించి.. ఎవరి స్థానిక జిల్లాకు వారిని కేటాయించాలని డిమాండ్ తో ప్రగతి భవన్ ముట్టడికి విడతలవారీగా ప్రయత్నిస్తున్నారు టీచర్లు. చిన్నారులను వెంట తీసుకుని రెండురోజులపాటు ప్రగతి భవన్ దగ్గరకు వెళ్లారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Advertisement
ఇటు ఇంతకుముందే అరెస్ట్ అయిన వారు.. గోషామహల్ గ్రౌండ్ లో చిన్నారులతో కలిసి ఆందోళన కొనసాగిస్తున్నారు. జీవో వల్ల పడుతున్న బాధను కేసీఆర్ కు చెప్పుకునేందుకు ప్రగతి భవన్ కు వెళితే.. పోలీసులు తమపై, తమ పిల్లలపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. 317 జీవోతో తాము నరకం అనుభవిస్తున్నామని వాపోయారు. ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు స్థానికత చూశారని.. కానీ ఇప్పుడెందుకు చూడటం లేదని ప్రశ్నిస్తున్నారు టీచర్లు.
Advertisement
ఈ ఇష్యూపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. జీవో నెంబర్ 317తో పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టి, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులైన భార్యాభర్తలను ఒకరికొకరు కాకుండా చేస్తూ, వారి పిల్లలకు సైతం అన్యాయానికి గురి చేసిన కేసీఆర్ సర్కారుపై తిరుగుబాటు మొదలైందన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తమ స్థానికతను లాగేసుకోవడం తగునా? అని ప్రశ్నించారు. అసలే ఆవేదనలో ఉన్న టీచర్లను పిల్లలతో సహా పోలీసులు స్టేషన్ కి తరలించడం మరింత అమానుషమని మండిపడ్డారు.
ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కేసీఆర్ జాతీయ స్థాయిలో ఇంకెలా వెలగబెడతారో చెప్పాల్సిన పని లేదన్నారు విజయశాంతి. ఈ జీవో వల్ల చోటు చేసుకున్న అర్థం పర్ధం లేని బదిలీల వల్ల ప్రతిరోజూ వందలాది కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాల్సి వస్తోందని.. టీచర్లు ఆర్థికంగా కూడా చితికిపోతున్నారని వివరించారు. పిల్లల్ని చంకనేసుకుని వచ్చిన తల్లిదండ్రులు ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ఉపాధ్యాయులు ప్రగతి భవన్ ముట్టడికి సిద్ధపడ్డరని.. ఈ జీవోకి తగిన సవరణలు చెయ్యాలని లేదా రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు విజయశాంతి.