Advertisement
ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య చాలాకాలంగా పొసగడం లేదు. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా మారుతుందే గానీ ఎంతకీ తగ్గడం లేదు. తాజాగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వార్ జరగక తప్పలేదు. అయితే.. ఈ పోరాటంలో చివరకు గవర్నర్ తమిళిసై దే పైచేయి. ఈ ఏడాది బడ్జెట్ ను ఫిబ్రవరి 3న ప్రవేశపెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈనెల 21న గవర్నర్ కు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అనుమతి కోరింది. 26న ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు స్వయంగా గవర్నర్ ను కలిశారు.
Advertisement
మంత్రి హరీశ్ రావు ఈనెల 27న గవర్నర్ కు లేఖ రాశారు. ఫిబ్రవరి మూడో తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నందున.. వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. అయితే.. ప్రతీసారి తన ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుండడంపై తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ కు ఆమోదం తెలపకుండా కొన్ని కారణాలను ఎత్తిచూపారు. దీంతో చేసేదేం లేక ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అదే సమయంలో గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉందా అని లేఖలో ప్రశ్నించారు.
Advertisement
అయితే.. హైకోర్టు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదంలోకి న్యాయవ్యవస్థను ఎందుకు లాగుతున్నారని అడిగింది. రాజ్యాంగ వ్యవస్థలను కోర్టు ముందుకు తీసుకురావడం ఎందుకని వ్యాఖ్యానించింది. గవర్నర్ విధులపై న్యాయసమీక్ష జరిపే పరిధి.. నోటీసు ఇచ్చే అధికారం కోర్టులకు ఉంటుందా.. ఈ వివాదంలో తాము ఏమని ఆదేశాలు ఇవ్వగలమని పేర్కొంది. ఆర్థిక బిల్లులు, బడ్జెట్‌కు గవర్నర్ తప్పనిసరిగా అనుమతివ్వాల్సిందేనని ప్రభుత్వం వాదించింది. అయితే.. ప్రభుత్వం, రాజ్ భవన్ తరఫు న్యాయవాదులు చర్చించి పరిష్కరించుకోవాలని సూచించింది న్యాయస్థానం.
హైకోర్టు సూచనలతో లాయర్లు సమావేశమయ్యారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది దుశ్యంత్ దవే, గవర్నర్ తరఫు న్యాయవాది అశోక్ ఆనంద్ కుమార్ కలిసి చర్చలు జరిపారు. తర్వాత.. బడ్జెట్ సమావేశాలు రాజ్యాంగం, చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా జరపాలని నిర్ణయించినట్లు హైకోర్టుకు తెలిపారు ఏజీ. గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ ప్రారంభమవుతుందని.. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్నే తమిళిసై చదువుతారని వెల్లడించారు. వివాదం చర్చల ద్వారా పరిష్కారమైనందున పిటిషన్ పై విచారణ ముగించింది హైకోర్టు.