Advertisement
ఎమ్మెల్యేల ఎర కేసులోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంట్రీ ఇచ్చేశాయి. ఇప్పటికే ఈడీ రంగంలోకి దిగి విచారణలు జరుపుతుండగా.. సీబీఐకి కూడా లైన్ క్లియర్ అయింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ సీబీఐకి అందింది. దీంతో అఫీషియల్ గా మరో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగినట్టయింది. అయితే.. తీర్పు కాపీలో కొన్ని కీలక విషాలను ప్రస్తావించారు న్యాయమూర్తి. కేసును సీబీఐకి అప్పగించేందుకు 98 పేజీల్లో 45 కారణాలను పొందుపరిచారు.
Advertisement
కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సిట్ దర్యాప్తు సరిగ్గా జరిగిందని అనిపించడం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ 455/2022 ను సీబీఐకి బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చారు. సిట్ ను రద్దు చేసి.. కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జడ్జిమెంట్ కాపీలో కేసీఆర్ ప్రెస్ మీట్ ప్రస్తావన చేర్చడం కూడా సంచలనంగా మారింది.
Advertisement
కోర్టుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను పబ్లిక్ చేయడంపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు విడుదల చేయడం కూడా సమంజసం కాదని స్పష్టం చేశారు. సీఎంకు సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని స్పష్టం చేశారు. తన తీర్పులో 26 కేసుల్లో పాత జడ్దిమెంట్లను న్యాయమూర్తి ప్రస్తావించారు. దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదని తెలిపారు. ఆర్టికల్ 20, 21 ప్రకారం న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చునని తెలిపారు.
మరోవైపు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు సంబంధించి వేసిన రిట్ పిటిషన్ పైనా హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ కేసు కొట్టివేయాలని ఆయన కోరారు. జస్టిస్ కె లక్ష్మణ విచారణ జరిపారు. పార్టీ మారాలని రోహిత్ రెడ్డికి వందకోట్లు ఆఫర్ ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఆయన తరఫు న్యాయవాది. కేవలం ఆఫర్ మాత్రమే చేశారని.. డబ్బులు ఇవ్వలేదన్నారు. ఆర్థిక లావాదేవీలు జరగలేదు కనుక ఈడీకి విచారణ పరిధి లేదని తెలిపారు. వ్యక్తిగత వివరాల కోసం ఈడీ తనను వేధిస్తోందన్న రోహిత్ రెడ్డి అన్నారు. వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. స్టే ఇచ్చేందుకు కుదరదని.. తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది.