Advertisement
తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అయితే.. ఇది కుదిరే పనేనా? అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే.. తెలంగాణలో టీడీపీలో బడా లీడర్లు తక్కువే. క్యాడర్ కూడా చెల్లాచెదురైంది. అయితే.. చంద్రబాబు మాత్రం పోరాటం చేద్దామని ఉన్న కొద్దిమంది నేతలకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీ కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Advertisement
పేదల పార్టీ అయిన టీడీపీ పుట్టింది తెలంగాణ గడ్డపైనే అని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత కాలం టీడీపీ ఉంటుందన్న ఆయన.. అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తమదేనని గుర్తు చేశారు. పటేల్, పట్వారీ విధానం రద్దు చేసిన తర్వాతే తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. పేదల అభివృద్ధి కోరుకుంటున్న ప్రతీ ఒక్కరూ తెలుగుదేశంతో చేతులు కలిపి ముందుకు రావాలని కోరారు.
Advertisement
దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందంటే దానికి కారణం టీడీపీనే అని చెప్పారు చంద్రబాబు. హైదరాబాద్ ను తాను నిర్మించలేదని, అలా ఎప్పుడూ చెప్పుకోలేదని అన్నారు. సైబరాబాద్ కు మాత్రం పునాదులు వేసింది తానేనని చెప్పారు. హైదారాబాద్ లో ఐటీ అభివృద్ధికి నాంది పలికింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. వ్యవసాయం చేసే రైతు బిడ్డ నాగలితో పాటు మౌస్ పట్టుకోవాలని తానే చెప్పానని అన్నారు.
ఇక జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ… చంద్రబాబు ఆశీస్సులతో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించానని పేర్కొన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం ఉంటుందన్నారు. పార్టీకి పూర్వవైభవం రావడానికి గ్రామగ్రామాన తిరిగి కృషి చేస్తామని చెప్పారు.