Advertisement
జాతీయ రాజకీయాల కోసం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టి సారించిన ఆయన.. ఇప్పటికే కర్ణాటకలో కుమారస్వామి పార్టీకి మద్దతు ప్రకటించారు. అయితే.. ఏపీలో ఏ పార్టీతోనైనా దోస్తీ కడతారా? అనే చర్చ సాగుతుండగా.. సొంతంగానే ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు కీలక నేతలతో సంప్రదింపులు జరిపిన కేసీఆర్.. కొందర్ని పార్టీలోకి చేర్చుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.
Advertisement
నూతన ఏడాది నాడు కొత్త ఉత్సాహంతో బీఆర్ఎస్ ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతోంది. సోమవారం ఏపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథితో పాటు కొందరు.. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. చంద్రశేఖర్ ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది.
Advertisement
బీఆర్ఎస్ లోకి నేతల చేరికలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ విద్యార్థి యువజన జాయింట్ యాక్షన్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంతో ఏపీ భవిష్యత్ కు బంగారు బాటలు పడ్డాయని ఏపీ యూత్ అండ్ స్టూడెంట్స్ జేఏసీ అభిప్రాయపడింది. గడిచిన తొమ్మిదేండ్లలో చంద్రబాబు, జగన్ అధ్వాన్న పాలనతో రాష్ట్రంలోని అన్ని రంగాలు సర్వనాశనం అయ్యాయని తెలిపింది.
అన్ని వనరులు ఉన్న ఏపీని ఆదుకొనే నాయకుడు లేక అల్లాడుతోందని, చారిత్రక ఉద్యమనేతగా సకల జనుల సంక్షేమం దిశగా పాలనా వ్యవస్థను తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ లాంటి నాయకుడి ద్వారానే రాష్ట్ర సమస్యలు తీరి అభివృద్ధి చెందుతుందని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. రైతు రాజ్యమే లక్ష్యమంటూ ఇప్పటికే రాష్ట్రాల్లో రైతు కిసాన్ లను ఏర్పాటు చేస్తున్నారు కేసీఆర్. ఇప్పుడు ఏపీలో చేరికలపై దృష్టి సారించడంతో మున్ముందు ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేది ఆసక్తికరంగా మారింది.