Advertisement
ఎమ్మెల్యేల ఎర కేసును అస్త్రంగా మలుచుకుంటోంది టీపీసీసీ. బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనాలని బీజేపీ ప్రయత్నించిందని కేసీఆర్ నానా రాద్ధాంతం చేస్తున్నారని.. మరి.. కాంగ్రెస్ నుంచి లాగేసుకున్న ఎమ్మెల్యేల సంగతేంటని ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే ఫిర్యాదు వరకు వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు హస్తం నేతలు.
Advertisement
పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రేవంత్.. తమ ఫిర్యాదుపై లోతుగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపులపై సీబీఐ, ఈడీకి సైతం ఫిర్యాదు చేస్తామని అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమని ప్రకటించారు. సీఎం కేసీఆర్ అహంకారానికి తెలంగాణ సమాజం సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
Advertisement
కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోలేదని మండిపడ్డారు రేవంత్. కేసీఆర్ 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మందిని తమవైపు తిప్పుకొని విలీనం చేసుకుంటే తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా స్పీకర్ ఓకే చెప్పారని అన్నారు. అలా పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో సబితకు మంత్రి పదవి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డికి ఆర్థిక పదవులు కట్టబెట్టారని ఫైరయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు పొందారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు రేవంత్ రెడ్డి.
మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా తగ్గేదే లేదంటున్నారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని పైలట్ రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ ఆరోపణలకు తలాతోకా లేదని అదే తాను పెట్టిన కేసులో ఆధారాలున్నాయని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేకపోతే వాళ్ల లీగల్ టీం ఎందుకు కోర్టులో వాదిస్తోందని ప్రశ్నించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి ఎంత లబ్ది చేకూరిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బ్లాక్ మెయిలింగ్ కు రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని ఆరోపించారు రోహిత్ రెడ్డి.