Advertisement
చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవం పై విక్రమ్ ల్యాండర్ ను విజయవంతంగా ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించిన నాటి నుంచి ఏదో ఒక ఆసక్తికర సమాచారాన్ని పంచుకుంటున్న ఇస్రో.. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. చంద్రుడిపై దక్షిణ ధృవంపై తిరుగుతూ పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్.. చంద్రుడి పొరల్లో ఉన్న కెమికల్ ఎలిమెంట్స్, ఖనిజాలను కనుగొంది. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నట్టు ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. చంద్రుడిపై సల్ఫర్ నిక్షేపాలు కూడా భారీగానే ఉన్నాయని, పలు ఖనిజాలు ఉన్నట్లుగా ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్ ద్వారా వెల్లడించింది.
Advertisement
Advertisement
సల్ఫర్ ను సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారీ దగ్గర నుంచి రాకెట్ ప్రొపల్లెంట్స్ తయారీ వరకూ ఉపయోగించుకునేందుకు అవకాశం ఉండగా.. ఆక్సిజన్ ప్రాణవాయువుగా మనిషి మనుగడకు సహకరించనుంది. చంద్రుడి ఉపరితలంలో అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్ ,ఆక్సిజన్ ఉన్నాయని ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించిందని ఇస్రో తెలిపింది. జాబిల్లిపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు, అక్కడి రసాయన, ఖనిజాలను పరిశోధించేందుకు LIBS అనే పరికరాన్ని ప్రజ్ఞాన్ రోవర్ కు ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు. ఆ పరికరమే చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న ఖనిజాలను గుర్తించింది. హైడ్రోజన్ ఆనవాళ్ల కోసం కూడా ఆన్వేషణ కొనసాగుతుందని ఇస్రో తెలిపింది. మరో వారం రోజుల పాటు ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ అక్కడి నేలను, వాతావరణాన్ని విశ్లేషించనుంది.