Advertisement
భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఏ రాష్ట్రానికి వెళ్లినా జనం రాహుల్ వెంట అడుగులో అడుగేస్తూ ముందుకు కదులుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కీలక నేతలు ప్రెస్ మీట్లతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పార్టీలపై విమర్శల దాడి చేస్తున్నారు. ప్రస్తుతం జోడో యాత్ర తెలంగాణలో జరుగుతోంది. ఈ క్రమంలోనే సీనియర్ నేత జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీలు అని వ్యాఖ్యానించారు.
Advertisement
బీజేపీపై కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాటం చేస్తోందన్న జైరాం.. జోడో యాత్రతో మోడీ, కేసీఆర్ అధికారం నుంచి దిగిపోవడానికి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కానీ.. ఫ్రీడమ్ ఆఫ్టర్ స్పీచ్ లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో 8వ నిజాం ఉన్నాడని.. మోడీకి కేసీఆర్ సామంత రాజులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Advertisement
కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారులను డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా అభివర్ణించారు జైరాం. కాకపోతే ఆ రైలు తప్పుడు మార్గంలో వెళ్తోందని ఎద్దేవ చేశారు. సరైన ట్రాక్ పైకి తీసుకురావడం భారత్ జోడో యాత్ర లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. వైఎస్సార్సీపీ, టీడీపీ, టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీలని బీజేపీతో మంచి అవగాహన ఉందని ఆరోపించారు. ఎంఐఎం కూడా అదే దారిలోనే ఉందన్నారు.
పరిపాలన విషయంలో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ కు ఎలాంటి తేడా లేదని ఆరోపించారు జైరాం రమేష్. రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి పాదయాత్రకు విశేష స్పందన వస్తోందని తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కు కొత్త దిశానిర్దేశం చేస్తుందని అన్నారు. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అన్ని వర్గాల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని వివరించారు. ఇప్పటికే వందలమంది విద్యార్థులు, కార్మికులు, సామాజిక వేత్తలను కలిశారని.. టీఆర్ఎస్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ యాత్ర ద్వారా తమకు తెలిసిందన్నారు జైరాం రమేష్.