Advertisement
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మద్యం ఏరులై పారుతోంది.. డబ్బు ప్రవాహం కొనసాగుతోంది. కోట్లకు కోట్లు వాహనాల్లో దొరుకుతున్నాయి. ప్రధాన పార్టీలకు ఈ ఎన్నిక చాలా ముఖ్యం కావడంతో పోటీపడి ప్రలోభాలకు గురి చేస్తున్నాయని ఆయా పార్టీల నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో మూడు గిఫ్ట్ లు, ఆరు దావత్ లు అనేలా పరిస్థితి ఉందని చెప్పుకుంటున్నారు. ఆఖరికి దైవ దర్శనాలను కూడా ప్రలోభానికి వాడేస్తున్నారు.
Advertisement
తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయాన్ని పునర్ నిర్మించింది. ఇప్పుడు బైపోల్ సందర్భంగా దేవుడ్ని సైతం గులాబీ నేతలు వాడేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని గ్రామాలకు ఇంచార్జ్ లను నియమించి గెలుపు కోసం ప్రయత్నిస్తోంది టీఆర్ఎస్. అలా.. దండు మల్కాపురం గ్రామానికి ఇంచార్జ్ గా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. గులాబీ నేతల మధ్య పెట్టిన పోటీలో తాను వెనకబడకూడదని అనుకున్నారో ఏమో.. ఆయన గ్రామస్థులకు యాదాద్రి ఆలయంలో స్పెషల్ దర్శనం ఇప్పించారని టాక్.
Advertisement
స్వామివారి ఆరగింపు సేవను నిలిపివేయించి మరీ ఈ దర్శనం చేయించారట. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 15 బస్సుల్లో గ్రామస్థులను గుట్టకు వెళ్లారు. వారు చేరుకునే సరికి మధ్యాహ్నం 12 గంటలు అయింది. ఆ సమయంలో స్వామివారి ఆరగింపు సేవ ఉంటుంది. దాన్ని నిలిపేసి మరీ దండు మల్కాపురం ఓటర్లకు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం చేయించారట.
మొత్తం 15 బస్సులకు 9999 నెంబర్ ఫార్చునర్ కారు ఎస్కార్ట్ గా ఉందని తెలుస్తోంది. అధికారులు నేరుగా వాటిని కొండపైకి అనుమతించడం వివాదాస్పదమైంది. మరోవైపు దర్శనం తర్వాత గ్రామస్తులకు విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 40 మేకలు కోసి దావత్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.