Advertisement
ప్రస్తుతం బీజేపీకి, టీఆర్ఎస్ కు పడడంలేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి గులాబీ నేతలు కేంద్రాన్ని టార్గెట్ చేసుకున్నారు. ఏ చిన్న విషయం దొరికినా దాన్ని పట్టుకుని తిట్ల దండకం అందుకుంటున్నారు. కొందరైతే లైన్ క్రాస్ చేసి మరీ విమర్శల దాడి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ నిత్యం ట్విట్టర్ లో కేంద్రాన్ని నిలదీస్తున్నారు.
Advertisement
బీజేపీపై పోరులో భాగంగా ఈమధ్యే పోస్టు కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కేటీఆర్. చేనేతకు సంబంధించి మంత్రి కార్డ్ రాసి పంపారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకొచ్చాయి. పెన్ పట్టుకుని కార్డ్ పై రాస్తున్నట్టు ఉన్న కేటీఆర్ ఫోటో నెట్టింట వైరల్ అయింది. ఇక కేటీఆర్ బాటలోనే ఆయన చెల్లెమ్మ కవిత నడుస్తున్నారు. ఆమె కూడా ప్రధాని మోడీకి పోస్ట్ కార్డ్ రాశారు.
Advertisement
దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చేనేత ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై ఎలాంటి పన్ను విధించలేదని గుర్తు చేశారు. మన చేనేత పరిశ్రమ దేశ సంస్కృతి, వారసత్వాన్ని నిలబెట్టేందుకు రాజీలేని కృషిచేస్తోందని అన్నారు. ఇటువంటి కీలక పాత్ర పోషిస్తున్న చేనేత పరిశ్రమను ఆసరా అందించి ప్రోత్సహించాల్సింది పోయి.. ఉత్పత్తులపై జీఎస్టీ భారాన్ని మోపడం సరికాదన్నారు.
జీఎస్టీ రద్దు చేయాలంటూ పోస్ట్ కార్డు రాసిన కవిత.. కేంద్రానికి చురకలంటించారు. చేనేత వస్త్రాలు, ఉత్పత్తులపై ఉన్న 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత రంగాన్ని రక్షించుకుందాం అనే పిలుపుతో https://www.change.org/ వెబ్ సైట్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఒక పిటిషన్ లింక్ ను కవిత ట్విట్టర్ లో షేర్ చేశారు. దానిపై ప్రతి ఒక్కరు సైన్ చేయాలని కోరారు.