Advertisement
మునుగోడులో ఓటమి పాలైంది బీజేపీ. అదే గనక గెలిచి ఉంటే.. ఈనెల 12న ప్రధాని మోడీ టూర్ ను ఓ రేంజ్ లో సక్సెస్ చేసేది. కానీ, ప్లాన్ అనుకున్నది జరగలేదు. నిజానికి ఈ ఉప ఎన్నికలో గెలుస్తామనే ధీమాతోనే మోడీ షెడ్యూల్ ను ఫలితాల తర్వాత పెట్టారనే ఆరోపణ ఉంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకు వస్తున్నారు మోడీ.
Advertisement
ముందుగా 11న ఏపీకి వెళ్తారు. 12న పలు కార్యక్రమాల్లో పాల్గొని అదే రోజు తెలంగాణకు రానున్నారు ప్రధాని. అయితే.. మోడీకి కొన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నాయి టీఆర్ఎస్, వామపక్ష పార్టీలు. మునుగోడులో గెలిచామన్న ధీమాతో ఉన్న ఈ పార్టీలు ప్రధాని ఈ 8 ఏళ్లలో ఏం చేశాయని ప్రశ్నించాయి.
Advertisement
టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ లో మోడీని నిలదీసింది. ‘‘ అయ్యా ప్రధాని మోదీ గారు తెలంగాణకు ఉత్త చేతులతోనే వస్తారా.. ఏమైనా తెస్తారా? తెలంగాణకు చేసిన అన్యాయాలపై ఏం చెప్తారు? విభజన చట్టం హామీల అమలు సంగతేమిటి? నీతి ఆయోగ్ చెప్పిన నిధులు ఇచ్చేది ఎప్పుడు? అని నిగ్గదీసి అడుగుతున్నది తెలంగాణ సమాజం’’ అని ట్వీట్ చేసింది. ఆ మరో ట్వీట్ లో ‘‘12న ప్రధాని మోదీ ప్రారంభించే రామగుండం ఎరువుల కర్మాగారం కార్యక్రమం ఆహ్వానంలో కనీస ప్రొటోకాల్ పాటించకుండా తెలంగాణ ప్రజలను అవమానించారు’’ అని మండిపడింది.
మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని… మోడీ టార్గెట్ గా విమర్శలు చేశారు. ఏడాది క్రితం ప్రారంభమైన ఎరువుల ఫ్యాక్టరీనీ మళ్లీ రీ ఓపెన్ చేయడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న మోడీని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలోని బొగ్గు బావులను బడా పారిశ్రామిక వేత్తలు ఆదానీ, అంబానీకి కేటాయించేందుకే ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోమని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు టీఆర్ఎస్ సోషల్ మీడియా యుద్ధానికి సిద్ధమైంది.