Advertisement
మునుగోడు మండలం పలివెలలో మంగళవారం బీజేపీ, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కొట్టుకున్నారు. అయితే.. తప్పు ఎవరిదనే విషయంలో మాత్రం ఇరు పార్టీల నేతలు విమర్శల దాడి చేసుకుంటున్నారు. ఓసారి ఎవరెవరు ఏమన్నారో చూద్దాం.
Advertisement
ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే
పలివెలలో ప్రచారం చేస్తున్న నా భార్యను తిట్టారు. బీజేపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వి జెండా కర్రలతో కొట్టారు. నా పీఆర్‌వో, గన్ మెన్లకు గాయాలయ్యాయి. నాపై ఈగ వాలినా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. నా గన్ మెన్లు లేకపోతే తలకు తీవ్ర గాయాలు అయ్యేవి. మునుగోడులో పలుమార్లు నా కాన్వాయ్ పై దాడికి యత్నించారు. డబ్బు సంచులు, అధికారం, మద్యం ప్రజల విశ్వాసం ముందు చెల్లవు. ఇది హుజూరాబాద్ ప్రజలు తేల్చి చెప్పారు. అహంకారం, దౌర్జన్యం, దుర్మార్గాన్ని బొంద పెట్టే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది.
కేటీఆర్, మంత్రి
ఈటల రాజేందర్ డైరెక్షన్ లోనే పలివెలలో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి జరిగింది. రాష్ట్రంలో బీజేపీ ఆగడాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో గత ఎనిమిదేండ్ల నుంచి శాంతియుత వాతావరణం ఉంది. ఈ వాతావరణం ఇలానే కొనసాగాలి. మీరు హింసను కోరుకుని, రెచ్చగొడితే మేం కచ్చితంగా యుద్ధానికే దిగుతాం. హింసకే పాల్పడుతామనే సిద్ధాంతం మీది ఏదైతో ఉందో.. దాన్ని తిప్పికొట్టే శక్తి, సత్తా మాకు ఉంది. కానీ, మధ్యలో నలిగిపోయేది సామాన్యులే. ఎన్నికల సమయంలో కాషాయ నేతలు కావాలనే హింసను రెచ్చగొడుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతోనే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోలీసులు, ఎన్నికల సంఘం కొమ్ము కాస్తున్నాయి. మునుగోడులో చీరలు, డబ్బులను టీఆర్ఎస్ విచ్చలవిడిగా పంచి ఓటర్లను ప్రభావితం చేసింది. ఉప ఎన్నిక ప్రచార సమయంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేశారు. కానీ, మేము సంయమనంతోనే ఉన్నాం. ఉపఎన్నికలో గెలవడానికి సామాన్యుల ప్రాణాలతో టీఆర్ఎస్ చెలగాటం ఆడుతోంది. ఓటమి భయంతోనే దాడులకు పాల్పడింది.
జగదీష్ రెడ్డి, మంత్రి
కేసీఆర్ ఎప్పుడూ హింసను ఇష్టపడరు. ప్రజలు లేకపోవడంతోనే సభలను బీజేపీ రద్దు చేసుకుంది. బీజేపీలో అగ్రనేతలే భయపడుతున్నారు. తెలంగాణలో ఉన్నంత స్వేచ్చాయుత వాతావరణం మరే రాష్ట్రంలో లేదు. సీఎంపై బీజేపీ నేతలు వాడుతున్న భాషను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ధర్మం, భాష గురించి ఈటల రాజేందర్ మాట్లాడి సానుభూతి పొందాలని చూస్తున్నారు. అది సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండేండ్లుగా ఇబ్బంది పెట్టేందుకు ఈటల ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన గూండాలు పలివెలలో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు.