Advertisement
టీఎస్పీఎస్సీ ఏఈ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్ మెయిన్ సర్వర్ నుంచి ప్రశ్నాపత్రాన్ని కొట్టేశాడు. అతను లూప్ కంప్యూటర్ల ద్వారా ఆ కాగితాన్ని సేకరించాడు. ప్రవీణ్ సేకరించిన పేపర్ ప్రింట్ తీసుకుని తనతో సన్నిహితంగా ఉండే రేణుకకు ఇచ్చాడు. అయితే.. ఆమె భర్తతో కలిసి పేపర్ అమ్మేందుకు ప్రయత్నాలు చేసింది. కొందరు అభ్యర్థుల్ని బుట్టలో వేసుకుంది.
Advertisement
ఈ లీకేజీ కేసులో కీలక పాత్ర పోషించిన 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరికి రెండు వారాల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. నిందితులకు వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే.. ఏఈ పరీక్షా పేపర్ ని మెయిన్ సర్వర్ నుంచి కొట్టేసి బయటికి ఎలా విక్రయించాడో.. గ్రూప్-1 పేపర్ ని చోరీ చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎందుకంటే.. ప్రవీణ్ గ్రూప్-1 పరీక్ష రాశాడు. అందులో 103 మార్కులు సాధించాడు.
Advertisement
ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఛైర్మన్ ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ బీజేవైఎం డిమాండ్ చేసింది. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ ఆఫీస్ వద్దకు ర్యాలీగా తరలివెళ్లి నానా రచ్చ చేశారు. ఆఫీస్ ముట్డడికి యత్నించారు. పలువురు కార్యకర్తలు కార్యాలయం గేట్లు ఎక్కి.. లోపలకి దూకారు. మరికొందరు టీఎస్పీఎస్సీ బోర్డును ధ్వంసం చేశారు. ఇటు అశోక్ నగర్ లోనూ విద్యార్థులు, నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. దీనికి ప్రతిపక్షాలు మద్దుతు తెలిపాయి.
ఈ లీకేజ్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. సమగ్ర నివేదిక కావాలని ఆదేశించింది. దీంతో ఛైర్మన్ జనార్ధన్ వెంటనే అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై అందరూ ప్రశంసించారు. పారదర్శకంగా నియామకాల ప్రక్రియలో ఎలాంటి రాజీ లేదు. ఏడాదిలో మొత్తం 27 నోటిఫికేషన్లు ఇచ్చాం. ఇప్పటికే 7 ఎగ్జామ్స్ పూర్తి అయ్యాయి. ఈ నెల 11వ తేదీన డేటా బయటికి వెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశాం. రాజశేఖర్ రెడ్డి అని నెట్ వర్క్ ఎక్స్ పర్ట్ ఏడేళ్లుగా ఇక్కడ పని చేస్తున్నాడు. అతని నైపుణ్యంతో ఇతర కంప్యూటర్ల డేటా యాక్సిస్ చేసినట్లు తెలిసింది. ప్రవీణ్ అనే మరో ఉద్యోగితో కలిసి పేపర్ లీకేజ్ చేశారు. పోలీసుల నుంచి అఫీషియల్ రిపోర్ట్ వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటాం. కమిషన్ లో నమ్మిన వాళ్లే గొంతు కోశారు’ అని ఆవేదన చెందారు. గ్రూప్-1 మెయిన్స్ జూన్ 5 నుంచే నిర్వహించాలని నిర్ణయమన్నారు. గ్రూప్-1 మెయిన్స్ యథాతథంగా నిర్వహిస్తామని వెల్లడించారు ఛైర్మన్.