Advertisement
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి స్పీడ్ ని పెంచారు. ఓవైపు కేంద్రమంత్రిగా కొనసాగుతూనే..మరోవైపు తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ తీరును ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు కిషన్ రెడ్డి. మొదటి సారి బాటసింగారంలోని డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించేందుకు ఛలో బాటసింగారం కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జులై 20న చేపట్టి ఛలో బాట సింగారం కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. ఆరోజు ఉదయం నుంచే పోలీసులు చాలా చోట్ల బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రఘునందన్ రావు పలువురు బీజేపీ రాష్ట్ర నేతలతో కలిసి బాటసింగారం వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కిషన్ రెడ్డి వర్షంలోనే రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను ఒక కేంద్ర మంత్రిని అని.. ఇండ్ల పరిశీలనకు వెళ్తుంటే.. తనను ఎందుకు ఆపుతున్నారని పోలీసులపై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు అయిన ఇండ్ల నిర్మాణాలను సమీక్షించేందుకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బాటసింగారం బయలుదేరి వెళ్తుండగా పోలీసులు శంషాబాద్ లో అడ్డుకున్నారని లేఖ ద్వారా వెల్లడించారు కిషన్ రెడ్డి. పార్లమెంట్ సభ్యుడిగా తన విధులకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుందని వివరించారు.