Advertisement
వంగవీటి మోహన్ రంగా.. కాపుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్. ఆయన బతికి ఉంటే ఇప్పటికే సీఎం అయి ఉండేవారని చెబుతుంటారు. అయితే.. ఎన్టీఆర్ హయాంలో ఈయన హత్యకు గురవ్వడంతో దీని వెనుక టీడీపీ పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏళ్లు గడిచాయి.. ఆయన కుమారుడు వంగవీటి రాధ.. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్లడం.. అక్కడి అవమానాలు తట్టుకోలేక తర్వాత టీడీపీలో చేరడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే.. ఇది కొందరికి రుచించలేదు.
Advertisement
రంగాను చంపింది టీడీపీ వర్గీయులే అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రాధా ఆపార్టీలో చేరడంపై అనేక విమర్శలు వచ్చాయి. కానీ, ఆయన అవేవీ పట్టించుకోలేదు. టీడీపీలోనే కొనసాగుతున్నారు. మధ్యలో జనసేనలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే.. లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రలో రాధా పాల్గొని స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
Advertisement
37వ రోజు యాత్రను లోకేశ్ మొదలుపెట్టగానే.. వంగవీటి రాధా పాల్గొన్నారు. యాత్రకు సంఘీభావం తెలిపిన ఆయన.. లోకేష్ తో పాటు పాదయాత్ర చేశారు. వీరిద్దరూ నడుస్తూ పలు విషయాలపై చర్చించుకోవడం కనిపించింది. రాధా ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నప్పటికీ.. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీని వీడతారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో యువగళం పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలుపుతూ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు.. పాదయాత్ర ప్రారంభానికి ముందు కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం దగ్గర ముస్లిం ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు లోకేష్. బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు కూడా టీడీపీ హయాంలో ఏనాడూ మైనార్టీ సోదరులపై దాడులు జరగలేదన్నారు. మైనార్టీల్లో పేదరికం ఉండకూడదనే లక్ష్యంతో కార్పొరేషన్ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మైనార్టీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని చెప్పిన.. జగన్ మోసం చేశారని విమర్శించారు లోకేష్.