Advertisement
ఈ మధ్యకాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందన్న విషయం తెలిసిందే. ప్రేమ అంటే అర్థం తెలియని వయస్సులో.. ప్రేమ పంజరంలో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకుంటారో లేదో అని అనుమానంతో ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. తాజాగా ఓ ప్రేమ జంట అలాంటి దారుణానికే ఒడిగట్టింది. తమ పెళ్ళికి పెద్దలు అంగీకరించడం లేదని చెట్టు కొమ్మకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని కాకాని కుంట వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
Advertisement
Read also: సూపర్ స్టార్ నల్ల కళ్లద్దాల వెనుక అసలు స్టోరీ ఇదే !
అద్దంకిలోని బత్తులవారిపాలే కి చెందిన బత్తుల పెద్దిరాజు (22) ఇంటర్మీడియట్ చదివి ఇటుక బట్టీల్లో పొట్టు లారీల పనికి వెళ్తున్నాడు. అదే పట్టణంలోని కొత్తపేటకు చెందిన పల్లపోతు ప్రశాంతి (20) ఇంటర్మీడియట్ చదివి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. రెండేళ్ల క్రితం వీరికి పట్టణంలోనే పరిచయం ఏర్పడింది. అది కాస్తా కొంతకాలానికి ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లో పెద్దలకు తెలిసింది. దీంతో వాళ్ళు మందలించారు. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించడం లేదని ప్రశాంతి ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి ప్రశాంతిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇద్దరి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. యువతి తల్లిదండ్రులు స్టేషన్ లో పెళ్లికి అంగీకరించి ఇంటికి తీసుకువెళ్లారు.
Advertisement
కానీ పెళ్లి చేయకుండా కాలయాపన చేస్తుండడంతో మనస్థాపం చెందిన పెద్దిరాజు, ప్రశాంతి సోమవారం అర్ధరాత్రి స్థానిక ఘరాటయ్య కాలనీ సమీపంలోని కాకానికుంట వద్దకు చేరుకొని చెట్టుకోమ్మకు ఉరి వేసుకుని మృతి చెందారు. తెల్లవారుజామున కాకానికుంట బహిర్భూమికి వెళ్లిన వారికి పెద్దిరాజు, ప్రశాంతి చెట్టుకు వేలాడుతూ కనిపించారు. అయితే అంతకు ముందు పెద్దిరాజు తన స్నేహితులకు మెసేజ్ చేశాడు. తాను క్షేమంగానే ఉన్నట్లు స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. అయితే ఆ తర్వాత చెట్టుకు ఉరివేసుకొని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు.
చెట్టుకు వేలాడుతున్న వారిని చూసి ఇరు కుటుంబాల వారు బోరున విలపించారు. సిబ్బంది సాయంతో మృతదేహాలను కిందకు దించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తన కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పెద్దిరాజు తండ్రి బత్తుల కృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు జరపాలని కోరుతూ పెద్దిరాజు మృతదేహంతో కొందరు యువకులు ఆసుపత్రి నుంచి స్థానిక భవాని సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.