Advertisement
రికార్డులను బ్రేక్ చేస్తూ ప్రపంచ జనాభా సంఖ్య దూసుకుపోతోంది. తాజా లెక్కల ప్రకారం 800 కోట్ల మైలురాయికి చేరుకుంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఈ రికార్డ్ నెలకొల్పడానికి భూమిమీదకు వచ్చింది ఓ చిన్నారి.
Advertisement
మనీలాలోని టోండోలో మంగళవారం తెల్లవారుజామున 1.29 నిమిషాలకు ఓ అమ్మాయి పుట్టింది. ఈ పాపకు వినీస్ మబాన్సాగ్ అని పేరు పెట్టారు. డాక్టర్ జోస్ ఫాబెల్లా మెమోరియల్ హాస్పిటల్ లో ఈ చిన్నారి జన్మించింది. ఈ జననంతో ప్రపంచంలో 8వ బిలియన్ వ్యక్తి పుట్టినట్లు పిలిప్పీన్స్ కు చెందిన జనాభా, అభివృద్ధి సంఘం పేర్కొంది. ఈ పాపకు చెందిన ఫోటోలను తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసింది.
Advertisement
1974లో ప్రపంచ జనాభా 400 కోట్లుగా ఉండేది. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన అనేక పురోగతుల కారణంగా అకాల మరణాలు తగ్గడంతో పాటు ఆయుర్దాయం గణనీయంగా పెరగడమే జనాభా పెరుగుదలకు కారణంగా పేర్కొంది ఐక్యరాజ్యసమితి. మరో 15 ఏళ్లకు అంటే 2037 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
700 కోట్ల నుంచి 800 కోట్లకు చేరేందుకు 12 ఏళ్ల సమయం పట్టింది. 2030 కల్లా 850 కోట్లకు, 2050 కల్లా 1,040 కోట్లకు చేరే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2023 నాటికి చైనాను అధిగమించి, భారత్ అత్యధిక జనాభా గల దేశంగా అవతరించనుందని పేర్కొంది. ప్రస్తుతం మన దేశ జనాభా 141.2 కోట్ల మేర ఉండగా.. 2050 నాటికి అది దాదాపు 170 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది ఐక్యరాజ్యసమితి. చైనా జనాభా ప్రస్తుతం 145 కోట్లుగా ఉంది.