Advertisement
గ్రామస్థాయిలో బలంగా లేకపోయినా.. ఏపీలో బీజేపీ ఏదో ఒక హడావుడి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆలయాలు, దేవుళ్ల విషయంలో తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తుంటుంది. తాజాగా ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి వారికో అస్త్రం దొరికింది.
Advertisement
మహా శివరాత్రి సందర్భంగా వైసీపీ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో ఓ బాలుడికి జగన్ పాలు తాగిస్తున్నట్లుగా చూపించింది. అయితే.. ఆ పిల్లాడి ఒంటికి విభూది, చేతిలో డమరుకం ఉంచింది. ‘‘అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధాన. ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ.. శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేసింది. ఇదే వివాదానికి కారణమైంది. ఈ పోస్టర్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
వైసీపీతో పాటు ముఖ్యమంత్రి జగన్ భేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. జగన్ శివుడికే పాలు తాగిస్తున్నట్టుగా అది ఉందని మండిపడ్డారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడాన్ని, భగవంతునికి అన్నం పెట్టడంతో పోలుస్తారా? అంటూ విష్ణువర్ధన్ రెడ్డి నిలదీశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోరాడాలని, అరెస్టులకు వెనుకాడకుండా ఉద్యమం చేయాలని పార్టీ నేతలకు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ పిలుపునిచ్చారు.
Advertisement
బీజేపీ నేతల విమర్శలపై వైసీపీ నాయకులు స్ట్రాంగ్ రియాక్ట్ అవుతున్నారు. బీజేపీ వక్రాభాష్యం ఆపాలని విమర్శించారు.. తాము కూడా హిందువులమేనని, అన్నార్తుల ఆకలి తీర్చడానికి ఈశ్వర ఆరాధన అంటే తప్పేముందని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏదో ఒక రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏ రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రశ్నించారు.
కొడాలి నాని స్పందిస్తూ.. అసలు మీరు మనుషులేనా అని బీజేపీ నేతలను నిలదీశారు. ఆకలితో ఉన్న వారికి జగన్ అన్నం పెడుతున్నారని.. పేదవాడికి అండగా ఉంటున్నారని.. ఆ అర్థంతో ఒక అభిమాని రూపొందించిన ఫొటోపై ఇలాంటి విమర్శలు ఏమిటని ప్రశ్నించారు. ఇటు వైసీపీ అధికారిక ట్విట్టర్ లో కూడా పార్టీ స్పందించింది. ‘‘ప్రపంచంలో అణువణువునా శివుడు కొలువై ఉన్నాడు. మంచి అన్నది ప్రతీది దైవమే.. అదే శివతత్వం. ఇందులో శివుడిని అవమానించడం ఎక్కడ జరిగిందో ఆ పరమాత్ముడికే ఎరుక’’ అని పోస్ట్ పెట్టింది.