Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం త్రిముఖ పోరు ఉంది. 2019 ఎన్నికల్లో అదే జరిగింది. అయితే.. మొన్న చంద్రబాబు, పవన్ భేటీ తర్వాత అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. వీళ్లిద్దరూ వచ్చే ఎన్నికల టైమ్ కి కలుస్తారని.. జగన్ సర్కార్ ను కూలుస్తారని ఎన్నో విశ్లేషణలు, అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ భేటీ తర్వాత వైసీపీ వ్యూహం మార్చిందనేది రాజకీయ విశ్లేషకుల వాదన. మరీ ముఖ్యంగా.. పవన్ కు అండగా ఉన్న కాపులను దూరం చేసే ప్రయత్నాలు మొదలు పెట్టిందని అంటున్నారు.
Advertisement
ఏపీలో కాపు సామాజిక వర్గంలో అత్యధిక ఓటర్లు ఉన్నారు. అయితే.. వీళ్లందరిలో అధిక శాతం జనసేన వైపే ఉన్నారు. దాన్ని తగ్గించేందుకు వైసీపీలోని కాపు నేతలంతా ఒక్కటయ్యారు. రాజమండ్రిలో కీలక సమావేశం నిర్వహించారు. కాపుల అభివృద్ధే ధ్యేయంగా 3 తీర్మానాలు చేశారు. 70 లక్షల మంది కాపులకు సంక్షేమ పథకాల లబ్ధి జరిగేలా చూసేందుకు కష్టపడతామని వ్యాఖ్యానించారు. అయితే.. సమావేశం ముఖ్య ఉద్దేశం పవన్ కు దగ్గరగా ఉన్న కాపు ఓటర్లను వైసీపీ వైపు మళ్లించడమేనని అంటున్నారు విశ్లేషకులు.
Advertisement
నిజానికి ఏపీలో కాపులను పార్టీల వారీగా చీల్చేశారు. ప్రజారాజ్యం సమయంలో కొంతమేర సమిష్టిగా చిరంజీవి వైపు నిలబడినా.. తర్వాత మళ్లీ చీలిపోయారు. జనసేన ఆవిర్భావం తర్వాత కాపు నాయకుడు సీఎం కావాలన్నది మళ్లీ జనాల్లోకి వెళ్లింది. అలా అధిక సంఖ్యలో కాపులు పవన్ వైపు నిలబడ్డారు. వైసీపీలో కాపు నాయకులు ఉన్నా.. సామాజికవర్గం పరంగా అండగా నిలబడిన ఓటర్లు తక్కువే. పైగా ఈసారి చంద్రబాబు, పవన్ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ కాపు నాయకులు.. తమ వర్గం వారికి గాలం వేసే పనిలో పడ్డారు.
మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు.. రెండు అంశాలనే ప్రధానంగా వినిపించారు. ఒకటి సంక్షేమ పథకాలు కాగా రెండోది పవన్ కళ్యాణ్ ని తిట్టడం. పవన్ కాపులకు అన్యాయం చేస్తున్నారని.. చంద్రబాబుతో కలిసి కుట్రలు చేస్తున్నారనేది వారి వాదన. అందుకే అందరూ వైసీపీ వైపు నిలబడాలని కోరారు. మొత్తానికి పవన్ దూకుడుకు బ్రేక్ వేసేందుకు వైసీపీ కాపు నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి.. వీళ్ల ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో..!