Advertisement
తండ్రి సొంత నియోజకవర్గం కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించారు నారా లోకేష్. అయితే.. వైసీపీ నేతలు యథావిధిగా ఎటాక్ కొనసాగించారు. లోకేష్ పాదయాత్రపై సెటైర్ల వర్షం కురిపించారు. చంద్రబాబు 100 అబద్ధాలు చెబితే, లోకేష్ 1000 అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈ పాదయాత్ర ఒక స్పాన్సర్డ్ కార్యక్రమం అని విమర్శించారు. చంద్రబాబు మంచి పనులు చేసుంటే లోకేష్ ఇవాళ ఎందుకు బజారునపడ్డారని ప్రశ్నించారు.
Advertisement
యువగళం పాదయాత్ర వల్ల టీడీపీకి మేలు జరగకపోగా కీడు జరుగుతుందన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. దీనివల్ల వైసీపీకే ఎక్కువ మేలు జరుగుతుందని చెప్పారు. జయంతికి వర్థంతికి తేడా తెలియని వ్యక్తి ఏం మాట్లాడతారోనని టీడీపీ శ్రేణులు భయపడుతున్నారని సెటైర్లు వేశారు. లోకేష్ యాత్రపై వైసీపీ ఆలోచించే పరిస్థితిలో లేదని, అసలా యాత్ర వల్ల ఫలితం ఉండదన్నారు. దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్.. యాత్రల పేరుతో జనంలోకి వచ్చి ఏం చేస్తారని ఎద్దేవ చేశారు. చంద్రబాబుకి పూర్తిగా మతి భ్రమించిందని, అందుకే ఆయన మెడకి మైక్ పెట్టుకున్నారని విమర్శించారు.
Advertisement
లోకేష్ పాదయాత్ర చేసినా, ఇంకేం చేసినా టీడీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. నందమూరి వారసుల నుంచి ముప్పు ఉంది కాబట్టే ఆయన ముందుగానే పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్తున్నారని చెప్పారు. అసలు సొంత పార్టీ నేతలే లోకేష్ ని నాయకుడిగా ఒప్పుకోవడం లేదని.. ఆయన వల్ల ఆ పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని విమర్శలు గుప్పించారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి సున్నా సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు కొడాలి నాని.
నారా లోకేష్ యువగళం పాదయాత్రపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందిస్తూ.. అది పాదయాత్ర కాదని, స్మశానయాత్ర అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానిని ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే యాత్రగా భావిస్తున్నానని అన్నారు. పాదయాత్ర చేసి సమస్యలు పరిష్కరించాలి కానీ.. శిలాఫలాకాలను ధ్వంసం చేస్తున్నారని నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.