Advertisement
ఏపీలో కూడా పాగా వేయాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈక్రమంలోనే మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీలోనూ బీఆర్ఎస్ కు మంచి ఆదరణ లభిస్తోందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు దేశానికి అవసరమని, త్వరలో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారని చెప్పారు.
Advertisement
తెలంగాణ లాంటి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్న మల్లారెడ్డి.. ఏపీలో పోలవరం పూర్తి కాలేదని, ప్రత్యేక హోదా రాలేదని అన్నారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే.. తెలంగాణలో కాళేశ్వరం తరహాలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే.. మల్లారెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ తనదైన రీతిలో కౌంటర్లు వేసింది. అందరి నేతల్లో కంటే మాజీ మంత్రి పేర్ని నాని కాస్త తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Advertisement
తెలంగాణ వాళ్లు శ్రీశైలం నుంచి దొంగ కరెంట్ తీసుకుంటున్నారని విమర్శించిన పేర్ని.. కేఏ పాల్ కూడా 175 స్థానాల్లో పోటీ చేశారని ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ చేస్తే అందులో తప్పేముందని సెటైర్లు వేశారు. తెలంగాణ మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని.. మోడీ, అమిత్ షా ఎప్పుడు వస్తారో అని వారంతా భయంతో ఉన్నారని అన్నారు. ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలేనని పేర్కొన్న పేర్ని నాని.. ఏపీకి చెందిన ఆస్తులు పంచారా? విభజన తరువాత రావాల్సిన డబ్బులు ఇచ్చారా? అని నిలదీశారు.
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉండదని.. శూన్యం అంటూ జోస్యం చెప్పారు మాజీ మంత్రి కొడాలి నాని. బీఆర్ఎస్ వల్లే నష్టపోయామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని.. జాతీయ రాజకీయాలపై అవగాహన ఉన్న కేసీఆర్ ఎక్కడైనా పోటీ చేయొచ్చని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగల్ గానే పోటీ చేస్తుందన్నారు.
ఏపీకి రావాల్సిన వాటిపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసును అడ్డుపెట్టుకుని ఏపీకి తీరని నష్టం చేశారని ఆరోపించారు. ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని, పోటీ చేయొచ్చని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ని అన్యాయంగా విభజించారని.. ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు రోజా.