Advertisement
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే చాలు.. వైసీపీ నేతలు రెచ్చిపోతారు. ఏం మాట్లాడుతున్నామనేది వారికి అనవసరం. ఎంత ఎక్కువ తిడితే అన్ని ఎక్కువ మార్కులు పడతాయని పోటీపడి మరీ మీడియా ముందుకొస్తుంటారు. కానీ, ఒక్కోసారి కొన్ని విమర్శలు వారి అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని బయటపెడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Advertisement
పవన్ కళ్యాణ్ త్వరలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. దానికోసం ఓ వెహికిల్ ను ప్రత్యేకంగా రెడీ చేయించారు. వారాహి అనే పేరు పెట్టి కొన్ని ఫోటోలను ఈమధ్యే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే.. ఆ రంగేంటి? ఆ టైర్లేంటి? బస్సు అలా ఉందేంటి? అంటూ వైసీపీ సైడ్ నుంచి అనేక కామెంట్లు వినిపించాయి. మాజీ మంత్రి పేర్ని నాని అయితే.. ఓ అడుగు ముందుకేసి ఇది చట్టవిరుద్ధమని స్టేట్ మెంట్ ఇచ్చారు. రంగులపై పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. కానీ, చివరకు తెలంగాణ రవాణా శాఖ ఈ ఇష్యూని సింపుల్ గా తేల్చేసింది. సైలెంట్ గా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి.. టీఎస్ 13 ఈఎక్స్ 8384 నెంబర్ ఇచ్చింది.
Advertisement
అధికారుల వెర్షన్ ప్రకారం.. వారాహి వాహనానికి వేసిన రంగు ఏ మాత్రం నిబంధనలకు విరుద్ధం కాదు. వాహనాలకు ఆలివ్ గ్రీన్ వాడొద్దని రూల్ ఉన్న మాట నిజమే కానీ.. దీనికి వేసింది ఎమరాల్డ్ గ్రీన్ అని నిర్ధారించారు. ఆలివ్ గ్రీన్, ఎమరాల్డ్ గ్రీన్ మధ్య సిమిలారిటీ ఉందని.. అయితే రెండూ ఒకటి కాదని స్పష్టం చేశారు. వెహికల్ బాడీ బిల్డర్ ఇచ్చిన సర్టిఫికెట్ ను పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలైంది. అర్థంలేకుండా వాదించడం కాదు ముందు గ్రీన్ లో ఉన్న రకాలను తెలుసుకోండి అంటూ జనసైనికులు సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు రంగుల విషయంలో పోయిన పరువును ఎలాగైనా నిలబెట్టుకోవడానికి వైసీపీ నేతలు వితండవాదానికి తెరతీశారని అంటున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలిసిన వెంటనే మీడియా ముందుకొచ్చిన మంత్రి గుడివాడ అమర్నాథ్.. వారాహి గురించి మాట్లాడారు. ఏపీలో తిరగాలంటే.. ఇక్కడి రూల్స్ పాటించాల్సిందేనని హెచ్చరించారు. తెలంగాణలో మాత్రమే తిరగటానికి వారాహి రిజిస్ట్రేషన్ అక్కడ చేయించారేమోనని ఎద్దేవ చేశారు. దీనిపై కౌంటర్ పంచ్ లు పేలుతున్నాయి. రంగుల విషయంలో రాష్ట్రానికో విధానం ఉంటుందా మంత్రిగారూ అంటూ సెటైర్లు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని తిడితే జనం తమ పేరును గుర్తుంచుకుంటారన్న ఉద్దేశంతోనే వైసీపీ నేతలు ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. అన్ని నిబంధనలను పరిశీలించి నేషనల్ పర్మిట్ తీసుకున్న వాహనానికి మళ్లీ ఏపీలో అధికారులు పరిశీలించడం ఏంటని.. ఇది ముమ్మాటికీ వైసీపీ నేతల మూర్ఖత్వానికి పరాకాష్ట అని కామెంట్స్ పెడుతున్నారు జనసైనికులు.