Advertisement
తెలంగాణ గడ్డపై ఎన్నో పార్టీలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ప్రయత్నాల్లో ఉన్నాయి. ఎవరికి వారు తామే గెలుస్తామని.. బీఆర్ఎస్ సర్కార్ ను గద్దె దించుతామని చెబుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పెట్టిన ప్రపోజల్ ఇంట్రస్టింగ్ గా మారింది.
Advertisement
పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు దీటుగా పోరాటం చేస్తున్నారు షర్మిల. అయితే.. ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారంపై ఎవరికి వారు కొట్లాడితే కాదని.. అందరం ఐక్యంగా పోరాటం చేద్దామని బీజేపీ, కాంగ్రెస్ ను కోరారు షర్మిల. ఈ మేరకు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు ఆమె ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని కోరారు.
Advertisement
కలిసి చర్చించుకుని ఉమ్మడి కార్యాచరణ చేద్దామని చెప్పి.. ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపునిద్దామని సూచించారు షర్మిల. కేసీఆర్ దిగి రావాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలన్నారు. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను రాష్ట్రంలో కేసీఆర్ బతకనియ్యరని వారికి వివరించారు. షర్మిల వినతికి ఇద్దరు నేతలు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమావేశమవుదామని బండి సంజయ్ చెప్పారు.
ఇటు రేవంత్ రెడ్డి మాత్రం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు. దీంతో, రేవంత్ స్పష్టత ఇచ్చిన తరువాత ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు పడతాయని అనుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా ప్రతిపక్షాలకు ఇదే తరహాలో షర్మిల లేఖ రాసారు. ప్రభుత్వంపై వ్యతిరేక పోరాటంలో కలిసి సాగుదామని ప్రతిపాదించారు. కానీ, ఏ పార్టీ ముందుకు రాలేదు. ఇప్పుడు నిరుద్యోగ అంశం పైన రెండు ప్రధాన పార్టీల నేతలకు ఫోన్ చేయడం.. వాళ్లు సానుకూలంగా స్పందించడం ఇంట్రస్టింగ్ గా మారింది.