Advertisement
వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. తెలంగాణలోని ప్రతీ నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని లింగగిరికి చేరుకుంది యాత్ర. అయితే.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలపై షర్మిల ఘాటైన విమర్శలు చేస్తుండడంతో ఆమెపై దాడి జరిగే ఛాన్స్ ఉందని పోలీసులు ముందే అలర్ట్ అయ్యారు. ముగ్గురు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, పది మంది ఎస్ఐలు, 120 మంది కానిస్టేబుళ్లు బందోబస్త్ కి వచ్చారు.
Advertisement
ముందుగా ఊహించినట్టే లింగగిరి దగ్గర షర్మిల కాన్వాయ్ పై ఎటాక్ జరిగింది. ఆమె కారవాన్ కు టీఆర్ఎస్ శ్రేణులు నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల గోబ్యాక్ అంటూ ఆందోళన చేశారు. అయితే.. పాదయాత్ర కొనసాగించి తీరుతానని షర్మిల భీష్మించుకుని ఉండగా.. పోలీసులు మాత్రం అడ్డుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు, వైఎస్ఆర్ టీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
Advertisement
లింగగిరి నుంచి షర్మిలను హైదరాబాద్ తరలించారు పోలీసులు. నగరానికి వచ్చాక మీడియాతో మాట్లాడిన ఆమె కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కొంతమంది వ్యక్తులు వచ్చి తమపై దాడి చేసి.. బస్సును తగులబెట్టినా పోలీసులు అడ్డుకోలేకపోయారని మండిపడ్డారు. బెదిరింపులు, దాడులు చేసినా భయపడకుండా పాదయాత్ర చేస్తున్నానన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడం తప్పా? అని నిలదీశారు. టీఆర్ఎస్ నేతలు గూండాలుగా మారిపోయి తమపై దాడులు చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడితే దాడులు చేస్తారా..? అని నిలదీశారు. ఆపార్టీకి ప్రజలు ఏమైనా రాష్ట్రాన్ని రాసిచ్చారా అని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ బందిపొట్ల రాష్ట్ర సమితిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా పని చేస్తున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడి చేయడం తెలంగాణ చరిత్రలోనే ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుందన్నారు. తనను ఈడ్చుకుంటూ పోలీస్ వ్యాన్ లో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేసిన తప్పు ఏంటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఆమె పెదవికు, డవడకు స్వల్ప గాయాలయ్యాయి. దానికి సంబంధించిన ఫొటోను వైఎస్సార్ టీపీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.