Advertisement
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తన తండ్రి చావుకు కారణమైన అసలు వ్యక్తులను శిక్షించాలని సునీత పోరాటం చేస్తుంటే.. అరెస్ట్ అయిన వారు ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అని చూస్తున్నారు. ఇంకోవైపు విచారణను సీబీఐ దూకుడుగా కొనసాగిస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డి విచారణపై కోర్టు ఫుల్ హ్యాండ్ ఇవ్వడంతో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
Advertisement
రెండు రోజులుగా సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డిని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు అధికారులు. మొదటి రోజు 8 గంటలపాటు విచారించగా.. రెండోరోజు 9 గంటల పాటు ప్రశ్నించారు. ఈ విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేశారు. వివేకా చనిపోయిన ముందు రోజు పరిస్థితులపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల విషయాలను సైతం అడిగి తెలుసుకున్నారు. అవినాష్ రెడ్డి న్యాయవాది వినే విధంగా ఆయనను 9 గంటల పాటు విచారించారు అధికారులు. ఎప్పటిలాగే మళ్లీ రావాలని కబురు అందించారు.
Advertisement
ఇటు ఇదే కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డిలను రెండో రోజు కస్టడీకి తీసుకుంది సీబీఐ. సుమారు ఆరు గంటలపాటు వారిని విచారించారు. ఈనెల 24 వరకూ వీరి కస్టడీ కొనసాగనుంది. అది ముగిసిన తర్వాత న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించాల్సి ఉంటుంది. అయితే.. అనారోగ్యంతో ఉన్న భాస్కర్ రెడ్డిని తమ వద్ద ఉంచుకోవడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఏరోజుకారోజు జైలుకు తరలించి మళ్లీ మర్నాడు ఉదయం విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి తీసుకొని రావాలని అధికారులు నిర్ణయించారు. ఇటు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. ఎలాంటి సంబంధం లేకుండా ఈ కేసులో తమను సీబీఐ ఆరెస్ట్ చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు.
మరోవైపు, వివేకా కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. హైకోర్టు నిర్ణయాన్ని ఆమె సుప్రీంలో సవాల్ చేశారు. అవినాష్ రెడ్డిని ఈనెల 25 వరకు అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ ముందస్తు బెయిల్ వ్యవహారంపై.. సుప్రీం ధర్మాసనం ముందు సునీత తరఫు న్యాయవాదులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. పిటిషన్ పై 21న విచారణ చేపడతామని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వెల్లడించింది. ఇంకోవైపు, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు ఈనెల 25కి వాయిదా వేసింది.