Advertisement
సత్యవతి రాథోడ్.. ఈ పేరు వినగానే మంత్రే గుర్తొస్తారు. కానీ, ఇదే పేరుతో మరో సెలెబ్రిటీ ఉన్నారు. ఆమే మంగ్లీ. ఈమె అసలు పేరు సత్యవతి రాథోడ్. తెలంగాణ జానపద గీతాలు, బోనాల పాటలతో బాగా ఫేమస్ అయింది. తర్వాత సినిమాలకు ప్లేబ్యాక్ సింగర్ గా అవకాశాలు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈమెకు సపరేట్ ఫాన్ ఫాలోయింగ్ ఉంది.
Advertisement
అయితే.. ఈమెకు ఉన్న ఫ్యాన్స్ లో ఎక్కువమంది వైసీపీకి సంబంధించిన వాళ్లే ఉంటారేమో. దానికి కారణం.. గత ఎన్నికల సమయంలో మంగ్లీ పాట లేనిదే వైసీపీ సభ ప్రారంభం అయ్యేది కాదు. అలా ఎన్నికల ప్రచారంలో ఈమె పాటల్ని తెగ వాడేశారు. జగన్ పై ప్రత్యేకంగా తయారు చేయించిన పాటలను మంగ్లీతో పాడిస్తూ ఓట్లు బాగానే దండుకున్నారు వైసీపీ నేతలు. దానికి ప్రతిఫలంగా అప్పటి ఈవెంట్లకు డబ్బులు ఇచ్చినా.. తాజాగా జగన్ సర్కార్ భారీ పదవినే కట్టబెట్టింది. కాకపోతే ఇది చినికిచినికి గాలివానలా మారుతోంది.
Advertisement
మంగ్లీని ఎస్వీబీసీ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు ఏమాత్రం అవగాహన, అనుభవం, అర్హత లేని ఆమెను టీటీడీ భక్తి ఛానల్ కి అడ్వైజర్ గా తీసుకోవడంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ఈ నియామకం వల్ల ఛానల్ కు కొత్తగా చేకూరే ప్రయోజనం ఏంటని భక్తులతో పాటు పలువురు రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ పదవిలో మంగ్లీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇందుకు నెలకి లక్ష రూపాయల చొప్పున జీతం. అయితే.. ఈమె బాధ్యతలు తీసుకోకుండానే.. నెల నెలా ఆమె అకౌంట్లో జీతం పడిందనే వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే మంగ్లీ అకౌంట్లో ఏడు నెలల జీతాన్ని ప్రభుత్వం చెల్లించిందని ప్రచారం సాగుతోంది. పదవీ బాధ్యతలు తీసుకోకుండా జీతం ఎలా చెల్లిస్తారంటూ ప్రతిపక్షాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇది జగన్ అనాలోచిత నిర్ణయంగా చెబుతున్నారు కొందరు. ఎందరో అన్నమయ్య కీర్తలను ఆలపించేవారు.. ఉద్దండులు ఉన్నారని వారిని కాదని కనీస అవగాహన లేని మంగ్లీని నియమించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.