Advertisement
అప్పుడెప్పుడో 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిక్కుల్లో పడేశాయి. సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష వేసింది. ఆనాడు మోడీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. దొంగలందరి ఇంటిపేరు మోడీయే ఎందుకంటూ వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్ బీజేపీ నేతలు కోర్టుకెక్కి.. పరువునష్టం కేసు వేశారు. దీనిపై తాజాగా సూరత్ కోర్టు రాహుల్ ను దోషిగా తేల్చి రెండేండ్ల జైలు శిక్ష విధించింది.
Advertisement
తీర్పు వెలువడే ముందు కోర్టు ఎదుట హాజరైన రాహుల్.. తన ఉద్దేశం సరైందేనని, దురుద్దేశంతో తాను మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ఆయన తరఫున వాదించిన న్యాయవాది జిగ్నేష్.. తన క్లయింట్ ను సమర్థించుకుంటూ ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదన్నారు. సాధారణంగా ప్రజలు మాట్లాడే మాటలనే ప్రస్తావించారని వాదించారు. అసలు ఈ కేసులో ప్రొసీడింగ్స్ అన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని జిగ్నేష్ పేర్కొన్నారు.
Advertisement
తీర్పు వెలువడిన కొద్ది సేపటికే రాహుల్ తరఫు న్యాయవాది అదే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. రెండేళ్ల జైలు శిక్షపై అప్పీలు చేసుకోవడానికి వీలుగా 30 రోజుల పాటు ఈ ఉత్తర్వులపై స్టే విధించింది కోర్టు. అప్పీలు దాఖలు చేసేంతవరకు ఈ శిక్షను అన్ని రోజులు నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఇక రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇది జ్యుడీడీషియరీని ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నమేనని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించింది. డరో మత్ (భయపడబోం) అని హిందీలో తన ట్విట్టర్ లో పేర్కొంది. మోడీ ప్రభుత్వం భయపడిపోతోందని, గిలగిలా కొట్టుకుంటోందని ఎద్దేవ చేస్తూ ట్వీట్ చేసింది కాంగ్రెస్.
మరోవైపు బీజేపీ భిన్నంగా స్పందించింది. ఈ విషయంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు కాంగ్రెస్ పార్టీకి బాగుంటాయేమో కానీ… దేశానికి ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కారణంగా పార్టీ పరువు పోతోందని కొందరు సభ్యులు తనకు చెప్పినట్టు మంత్రి తెలిపారు.