Advertisement
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు ఆస్ట్రేలియాకు వెళ్ళమన్నారు. ఇన్ని రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడులో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రచారం చేస్తారా? లేదా అనే విషయంలో సందిగ్ధం ఉండేది. బిజెపి నుంచి బరిలో తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తూ ఉండడంతో వెంకట్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉంటారనే ప్రచారం సాగింది. అయితే కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాత్రం మునుగోడులో వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తారని చెబుతూ వచ్చారు.
Advertisement
Advertisement
కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా వెంకట్ రెడ్డిని తనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనాలని కోరారు. ఆ తర్వాత వెంకట్ రెడ్డి ప్రచారంలో పాల్గొనబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేయడానికి వచ్చిన వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి తనలాంటి హోంగార్డులు అవసరం లేదని అన్నారు. “తనపై 100 కేసులు పెట్టిన వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తానని ఓ పెద్దమనిషి అన్నాడు కదా.. ఆ పెద్దమనిషి మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని వస్తాడు” అని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. అంత పెద్ద లీడర్లు ఉండగా మాలాంటి హోంగార్డులు, కానిస్టేబుల్ లతో ఏం పని అని ప్రశ్నించారు.
దీంతో ఆయన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండనున్నారని స్పష్టమైంది. తాజాగా నేడు ( శుక్రవారం) ఆస్ట్రేలియాకు కోమటిరెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ ఆస్ట్రేలియాకు వెళుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తిరిగి మళ్లీ నవంబర్ 7న హైదరాబాద్ రానున్నారు. అంటే మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్ కి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలందరూ వెంకట్ రెడ్డి మనసు మార్చేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ వెంకట్ రెడ్డి మనసు మార్చుకోకుండా విదేశాలకు వెళ్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది.
Read also: ఇంటికి కట్టిన గుమ్మడికాయ త్వరగా కుళ్ళిపోతే దాని అర్థం తెలుసా..!